
గిరిజన సంక్షేమ మంత్రికి అవగాహన లోపం
సీతంపేట: జీవో నంబర్ 3పై వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే సుప్రీంకోర్టులో రివిజన్ పిటీషన్ వేసినట్టు పాలకొండ మాజీ ఎమ్మెల్యే విశ్వాసరాయి కళావతి శనివారం ఓ ప్రకటనలో స్పష్టంచేశారు. గిరిజనుల ఓట్ల కోసం జీవో 3ని పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి దానిని నెరవేర్చడంలో కూటమి నేతలు వైఫల్యం చెందారన్నారు. కనీస అవగాహన లేని గిరిజన మంత్రి రకరకాలుగా అబద్ధాలు ఆడుతున్నారన్నారు. జీవో 3కి బదులు ఇంకొక జీవో, ఆర్డినెన్స్ గాని తీసుకువస్తామని 11 నెలలుగా కాలయాపన చేయడం తగదన్నారు. ఇంకా ఎంతకాలం గిరిజనులను మోసం చేస్తారని ప్రశ్నించారు. గిరిజనులు కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే ఆ తప్పును గత ప్రభుత్వంపై నెట్టడం అలవాటైపోయిందన్నారు. గిరిజన విద్యావంతులు అన్నీ గమనిస్తున్నారని, తగిన సమయంలో గట్టిగా బుద్ధిచెబుతారన్నారు. ఏజెన్సీ ప్రాంత ఉపాధ్యాయ పోస్టులను మెగా డీఎస్సీ నుంచి మినహాయించి, గిరిజన నిరుద్యోగుల కోసం ప్రత్యేక డీఎస్సీని ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన గిరిజన గురుకులాల్లో ఏళ్ల తరబడి పీజీటీ, టీజీటీ, పీఈటీ, పీడీలుగా పనిచేస్తున్నారని, వారి పోస్టులు మినహాయించకుండా నోటిఫికేషన్ ఇవ్వడంతో 1143 కుటుంబాలు వీధిన పడతాయన్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, సీఆర్‌టీగా మార్పు చేయాలని వారంతా 45 రోజులు ధర్నా చేస్తే న్యాయం చేస్తానని హామీ ఇచ్చిన గిరిజన మంత్రి వారిని ఇప్పుడు వెళ్లగొట్టే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. ఇది గిరిజనులకు అన్యాయం చేయడం కాదా అని ప్రశ్నించారు.
జీవో 3పై రివిజన్ పిటిషన్ వేసినది అప్పటి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వ హయాంలోనే..
గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం మానుకోవాలి
గిరిజనులకు ప్రత్యేక డీఎస్సీ నిర్వహించాలి