ప్రగతిపై చర్చకు సిద్ధం
వైఎస్సార్‌సీపీ చేసిన అభివృద్ధి గురించి లెక్కలతో ఒక్కడినే వస్తానని వ్యాఖ్య అవినీతి సొమ్ముతో జూలకంటి కుమారుడి పెళ్లి చేసినట్లు ఆరోపణ మీడియా సమావేశంలో ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్యే కాసు రెడ్‌బుక్ అరాచకాలు పరాకాష్టకు చేరాయని మాజీ మంత్రి విడదల రజిని ఆగ్రహం రౌడీలకు టికెట్లు ఇచ్చే అలవాటు చంద్రబాబుకు ఉందని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి ధ్వజం
పరాకాష్టకు చేరిన రెడ్‌బుక్ రాజ్యాంగం
హత్యలకు టీడీపీలో ఆధిపత్య పోరే కారణం
మాచర్ల ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డికి కాసు మహేష్ రెడ్డి సవాలు
సాక్షి, నరసరావుపేట: వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో చేసిన అభివృద్ధి, కాసు కుటుంబ ప్రతిష్టపై బహిరంగ చర్చకు సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి స్పష్టం చేశారు. మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి ఎక్కడికి రమ్మంటే అక్కడికి ఒక్కడినే లెక్కలతో వెళతానని సవాలు విసిరారు. నారా లోకేష్, చంద్రబాబు, యరపతినేనిలకు 2019 ముందు నుంచి సవాలు విసిరానని, బ్రహ్మారెడ్డి వచ్చినా చర్చకు సిద్ధమన్నారు. నరసరావుపేటలోని కాసు స్వగృహంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వైఎస్సార్‌సీపీ నేతలు కాసు మహేష్‌రెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డిలు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా కాసు మాట్లాడుతూ.. మాచర్లలో పిన్నెల్లి బ్రదర్స్‌పై టీడీపీ కూటమి ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తోందన్నారు. దీనిపై ప్రశ్నిస్తే జూల‘కంత్రి’ బ్రహ్మారెడ్డి ప్రెస్‌మీట్‌లో నోటికొచ్చినట్టు మాట్లాడారన్నారు. తాను పుట్టక ముందే సొసైటీ ఏర్పాటు చేసి ఈ ప్రాంత ప్రజలకు విద్య, ఉపాధి అవకాశాలు కల్పించిన ఘనత తమ వారిదన్నారు. 50 ఏళ్ల క్రితమే సుమారు రూ.1.50 లక్షలు చెల్లించి దీనికోసం స్థలం కొన్నామన్నారు. అదే మొత్తంతో ఆ సమయంలో తమ పెద్దలు హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లో 20 ఎకరాలు కొంటే, అది ఇప్పుడు సుమారు రూ.3 వేల కోట్లు పలికేదన్నారు. ఈ ప్రాంతానికి మేలు చేయాలన్న ఉద్దేశంతోనే కాసు సొసైటీ ఏర్పాటు చేశామన్నారు. మారుతున్న కాలంతో ఎయిడెడ్ కళాశాలలకు ఆదరణ తగ్గడంతో వాటి నిర్వహణకు మాల్ కట్టి కొంత ఆదాయం సమకూర్చుకుంటున్నామని పేర్కొన్నారు. నిర్మాణం కోసం ప్రభుత్వం జీవోలు, హైకోర్టు ఉత్తర్వులతోపాటు అవసరమైన అన్ని అనుమతులు తీసుకున్నట్లు తెలిపారు. అక్రమార్జన చేసి ఉంటే సొంతంగా ఆస్తులు కొనేవాడినని, సొసైటీలో ఎందుకు మాల్ నిర్మిస్తానని ప్రశ్నించారు. కాసు బ్రహ్మానందరెడ్డి, వెంగళరెడ్డి, కృష్ణారెడ్డిలు ఈ ప్రాంత అభివృద్ధికి ఏం చేశారో ప్రజలందరికీ తెలుసన్నారు. నాగార్జున సాగర్, బుగ్గవాగు, జాతీయ రహదారులు మొదలు తన హయాంలో వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఆదేశాలతో మెడికల్ కళాశాల, తాగునీరు, హైవేలు నిర్మించామన్నారు. హత్యారాజకీయాలు బ్రహ్మారెడ్డికి అలవాటేనని, ఏడు మర్డర్ల కేసులో ఆయన పేరు ఎందుకు ఉందో, టీడీపీ ఎందుకు సస్పెండ్ చేసిందో చెప్పాలన్నారు. 2019 ఎన్నికల ముందు బ్రహ్మారెడ్డి వైఎస్సార్‌సీపీలోకి రావాలని ప్రయత్నించినా ఆయన గురించి తెలిసి పార్టీలో చేర్చుకోవడానికి పీఆర్‌కే ఒప్పుకోలేదన్నారు. 18 నెలల్లో అవినీతి ఏ స్థాయిలో చేస్తే కుమారుడి పెళ్లి రూ.10 కోట్లు పెట్టి చేశావని ప్రశ్నించారు. పిన్నెల్లి సోదరులకు వైఎస్సార్‌సీపీ అండగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు.
కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి పల్నాడు జిల్లాలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై కట్టుకథలతో కేసులు పెట్టడం పరాకాష్టకు చేరింది. పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏ మాత్రం సంబంధం లేని కేసులో వారి పేర్లు పెట్టడం దారుణం. అసలు జంట హత్యలకు, పిన్నెల్లి బ్రదర్స్‌కు ఏమిటి సంబంధం? టీడీపీ గ్రూపుల మధ్య గొడవే కారణమని అందరికీ తెలుసు. చివరకు నాపైనా ఎన్నో అక్రమ కేసులు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వ అరాచకాలను ప్రజలు గమనిస్తున్నారు. మా పార్టీ నాయకులు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్న వారిలో ఎవ్వరినీ రేపు మా ప్రభుత్వం వచ్చాక వదలి పెట్టబోం. వారికి కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం. కాసు కుటుంబం రాష్ట్రానికి చేసిన సేవలు అందరికీ తెలిసినవే. వారి గౌరవాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారు, అవన్నీ విఫల ప్రయత్నాలు.
– విడదల రజిని,
మాజీ మంత్రి
గుండ్లపాడు జంట హత్యలకు టీడీపీలో ఆధిపత్య పోరే కారణం. సంఘటన జరిగిన గంటల వ్యవధిలోనే అప్పటి ఎస్పీ శ్రీనివాసరావు టీడీపీ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరుతో హత్యలు జరిగాయని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేసుకోండి. ఆ రోజు అరెస్టు అయిన అయిదుగురిలో పిన్నెల్లి సోదరులు లేరు. ఆ తర్వాత కావాలనే రాజకీయ కక్షతో వారిని కేసులో ఇరికించారు. పిన్నెల్లి సోదరులకు పార్టీ పూర్తి అండగా నిలుస్తుంది. శిక్షలు పడిన వారికి సైతం చంద్రబాబు టికెట్లు ఇచ్చారు, పిన్నెల్లిపై నిందలు తప్ప ఆధారాలు లేవు.
– డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్‌సీపీ
పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్


