రాజధాని నడిబొడ్డున చెరువు కబ్జా
మందడం(తాడికొండ): రాజధాని నడిబొడ్డున సచివాలయానికి కూతవేటు దూరంలో తుళ్ళూరు మండలం మందడం చెరువులో ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతున్నాయి. సుమారు 35 ఎకరాల్లో ఉన్న చెరువులో గతంలో పలువురు ఆక్రమించుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. ప్రభుత్వం అప్పట్లోనే వారికి పట్టాలు అందజేసింది. ఇటీవల తెలుగు తమ్ముళ్లు తెగించడంతో నెల రోజుల వ్యవధిలో 4 షెడ్లు వెలిశాయి. వీరిని చూసి మరి కొంతమంది ఆక్రమణలకు తెరలేపడంతో రూ. కోట్ల విలువైన ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నాయి. ఏపీ సచివాలయానికి కూతవేటు దూరం, సీఆర్‌డీఏ స్థానిక కార్యాలయానికి వెళ్లే దారిలోనే ఈ ఆక్రమణలు జరుగుతుండటంతో ముక్కున వేలేసుకోవడం అందరి వంతవుతోంది. త్వరలో ఇటుగా రోడ్డు నిర్మాణం జరగనున్న నేపథ్యంలో ఈ గృహాలను తొలగిస్తే పరిహారం భారీగా వస్తుందంటూ ప్రచారం సాగుతోంది.


