గుంతల రోడ్లే గతి..!
అధ్వానంగా మాదిపాడు, నరసరావుపేట, పేరేచర్ల రహదారులు కనీస మరమ్మతులు కూడా చేపట్టని చంద్రబాబు సర్కారు నిత్యం అవస్థలు పడుతున్న ప్రయాణికులు, వాహన చోదకులు
సత్తెనపల్లి: అధికారంలోకి వస్తే, సంక్రాంతి పండుగలోపే రోడ్లన్నీ బాగు చేస్తామన్న చంద్రబాబు నాయుడు ఇచ్చిన ఎన్నికల హామీ అటకెక్కింది. సంక్రాంతి పండుగ పోయి మళ్లీ సంక్రాంతి పండుగ వస్తున్నా మరమ్మతులు చేయకపోగా రోడ్లు మరింత అధ్వానంగా మారాయని ప్రజలు మండిపడుతున్నారు. ఏ రోడ్డు చూసినా గుంతలు దర్శనమిస్తున్నాయి. జిల్లా కేంద్రాలకు వెళ్లే రహదారుల దుస్థితి ఇలా ఉంది. వివిధ పనుల మీద చుట్టుపక్కల గ్రామాల నుంచి సత్తెనపల్లికి వచ్చే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
రూపు కోల్పోయిన రహదారులు..
సత్తెనపల్లి–మాదిపాడు, సత్తెనపల్లి–నరసరావుపేట, కొండమోడు–పేరేచర్ల ప్రధాన రహదారులు సైతం అధ్వానంగా మారాయి. కొండమోడు–పేరేచర్ల జాతీయ రహదారిని విస్తరించేలా గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలోనే మంజూరై చివరి దశకు వచ్చాక ప్రభుత్వం మారడంతో ఈ ప్రభుత్వం పనులు ప్రారంభించింది. అయితే కనీసం గుంతలకు మరమ్మతులు చేస్తే రాకపోకలకు ఇబ్బందులు ఉండవు. అవేమీ పట్టించు కోకపోవడంతో నిత్యం వాహన చోదకులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఎటు చూసినా గుంతలే కనిపిస్తుండడంతో నిత్యం రోడ్డు ప్రమాదాలతో ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు.
గుంతల రోడ్లే గతి..!


