బాబు పాలనలో భవిత శూన్యం
పరికరాలు రావాలి
భవిత కేంద్రాల్లో మానసికంగా, శారీరకంగా అవస్థలు పడుతున్న ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు ప్రభుత్వం భరోసానివ్వడం లేదు. ఏటా ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి దివ్యాంగ విద్యార్థులకు అవసరమైన పరికరాలు అందజేయాలి. కానీ అధికారంలోకి వచ్చి 17 నెలలు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో విద్యార్థులు అవస్థలు పడుతున్నారు. గతంలో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం దివ్యాంగ విద్యార్థులను గుర్తించి వారికి అవసరమైన పరికరాలను ఏటా అందించేది. పరికరాలను కొనే స్థోమత లేకపోవడంతో ప్రభుత్వ చేయూత కోసం తల్లిదండ్రులు నిరీక్షిస్తున్నారు.
తప్పని ఎదురుచూపులు..
సత్తెనపల్లి: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు భరోసా కల్పించేందుకు భవిత కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ప్రభుత్వం ఆయా కేంద్రాలను నిర్లక్ష్యం చేస్తోంది. శారీరకంగా, మానసికంగా అవస్థలు పడుతున్న ఎంతోమంది చిన్నారులు ఉపకరణాలు కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా ఫిజియోథెరపీ వైద్యుల కొరత వేధిస్తోంది. నాలుగు మండలాలకు ఒకరు చొప్పున సేవలందిస్తున్నారు. జిల్లాలో 28 భవిత కేంద్రాలు ఉండగా, వాటిలో ప్రత్యేక అవసరాలు కలిగిన పిల్లలు 540 మంది ఉన్నారు.
పాత పరికరాలతోనే
చదువుకు దూరంగా ఉన్న ఐదేళ్ల నుంచి 15 ఏళ్లలోపు పిల్లలను గుర్తించి భవిత కేంద్రంలో విద్యనందిస్తున్నారు. అలాగే మానసిక వైకల్యం, వినికిడి లోపం, ఆటిజం, దృష్టిలోపంతో బాధపడే వారికి కేంద్రంలోనే ఫిజియోథెరపీ నిర్వహించాల్సి ఉంటుంది. నాలుగు మండలాలకు ఒక్కరే ఫిజియోథెరపీ వైద్యులు ఉండడంతో వారానికి ఒకరోజు మాత్రమే వచ్చి సేవలు అందించాల్సిన పరిస్థితి. దీంతో సక్రమంగా ఫిజియోథెరపీ సేవలు అందడం లేదు. ఏళ్ల క్రితం అందజేసిన పరికరాలు ఇప్పుడు బాగా పాడవడంతో వాటితోనే సేవలందిస్తున్నారు. భవిత కేంద్రాల్లో ఐఈఆర్‌పీలుగా పని చేస్తున్న వారే పిల్లలకు ఫిజియోథెరపీ, స్పీచ్ థెరపీ, బ్రెయిలీ నైపుణ్యాలతోపాటు నడవడికను నేర్పిస్తున్నారు. అంతేకాకుండా పిల్లల పట్ల తల్లిదండ్రులు అనుసరించాల్సిన ప్రత్యేక శ్రద్ధపై కౌన్సెలింగ్ ఇస్తున్నారు.
ప్రత్యేక అవసరాలు కలిగిన దివ్యాంగులకు ఆగస్టులో శిబిరాలు నిర్వహించారు. ఇంకా యంత్ర పరికరాలు రాలేదు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. త్వరలోనే పంపిణీ చేస్తాం. ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారుల విషయంలో అన్ని ప్రభుత్వాలు వారికి చేయూతను అందించేందుకు ముందుకు వస్తున్నాయి. ఈ విషయంలో ఎలాంటి ఇబ్బంది ఉండదు. పిల్లలకు అర్థమయ్యే రీతిలో విద్యను బోధిస్తున్నాం.
– సెల్వరాజ్, ఇన్‌క్లూజివ్ ఎడ్యుకేషన్
జిల్లా కోఆర్డినేటర్, పల్నాడు
ప్రత్యేక అవసరాల పిల్లలకు భవిత కేంద్రంలో ఉచితంగా ఉపకరణాలు అందించాలి. ప్రత్యేక వైద్య శిబిరాలు నిర్వహించి దివ్యాంగుల అవసరాన్ని గుర్తించాలి. ఎవరికి ఏ పరికరం అవసరమో గ్రహించి, అందించాలి. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో ఏటా ప్రత్యేక శిబిరాలు నిర్వహించి ప్రత్యేక అవసరాలు పిల్లలకు ఉపకరణాలు అందించేవారు. దృష్టి, వినికిడి లోపం ఉన్నవారు కూడా సాధారణ విద్యార్థుల్లా ఉన్నత విద్య అభ్యసించాలనే ఉద్దేశంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం ఆధునిక సాంకేతికతతో కూడిన ట్యాబ్‌లు పంపిణీ చేసింది. ఐఈఆర్‌పీ (ఇన్‌క్లూసివ్ ఎడ్యుకేషన్ రీసోర్స్ పర్సన్స్)కు ఇలా మొత్తంగా 148 ట్యాబ్‌లను అందజేసింది. ట్యాబ్స్‌ను ఎలా వినియోగించాలన్న అంశంపై ఉపాధ్యాయులకు, చిన్నారులకు శిక్షణ ఇచ్చారు. ప్రతి ఏడాదిలాగే ఈ ఆగస్టులో ప్రత్యేక శిబిరం నిర్వహించి 18 ఏళ్ల వయసు లోపు ఉన్న ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించారు. వారికి ఉపకరణాలు అందించాల్సి ఉన్నా చంద్రబాబు సర్కార్ పట్టించుకోవడం లేదు.
బాబు పాలనలో భవిత శూన్యం


