
రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలే !
ప్రత్తిపాడు:రైతుల ఆత్మహత్యలన్నీ ప్రభుత్వ హత్యలేనని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కంచుమాటి అజయ్ కుమార్ మండిపడ్డారు. ప్రత్తిపాడు వైఎస్సార్ కాలనీలో ఇటీవల అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతు చల్లగిరి నాగరాజు కుటుంబాన్ని బుధవారం సాయంత్రం రైతు సంఘం నాయకులు పరామర్శించారు. కుటుంబ సభ్యులతో మాట్లాడారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ కౌలు రైతు నాగరాజు పంటలు పండకపోవడం, గిట్టుబాటు ధరలు, కౌలు రైతు కార్డు లేకపోవడం, బ్యాంకులు రుణం ఇవ్వకపోవడంతో తీవ్ర ఒత్తిడికి గురయ్యాడని తెలిపారు. ప్రైవేటు సంస్థల నుంచి వందకు మూడు నుంచి ఐదు రూపాయల వడ్డీకి అప్పులు తెచ్చి, అవి తిరిగి చెల్లించలేక మనస్తాపానికి గురై ఆత్మహత్యకు పాల్పడ్డాడని చెప్పారు.
ఎక్స్‌గ్రేషియా చెల్లించాలి
ప్రభుత్వం వెంటనే స్పందించి నాగరాజు కుటుంబానికి రూ. 10 లక్షల రూపాయలు ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని అజయ్ కుమార్ డిమాండ్ చేశారు. ఎకరం ప్రభుత్వ భూమిని ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు. బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న బ్యాంకు రుణాలను మాఫీ చేసి, తిరిగి నూతనంగా ఇప్పించాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉమ్మడి గుంటూరు జిల్లాలో మిర్చి, పొగాకు సాగు చేసిన 10 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆత్మహత్యలు నివారిస్తామని ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని ఆయన కోరారు. పరామర్శించిన వారిలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి కొత్త వెంకట శివరావు, నాయకులు కె. ఆదినారాయణ, నల్లమోతు రాజేంద్ర ఉన్నారు.