
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
భువనేశ్వర్: రాష్ట్రంలో బుధవారం వేర్వేరు రహదారి దుర్ఘటనల్లో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. తండ్రి అంత్యక్రియలకు వెళ్తుండగా దంపతులు, విధులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా మహిళా హోమ్ గార్డు, స్కూటరుని ట్రక్కున ఢీకొన్న దుర్ఘటనలో యువకుడు దుర్మరణం పాలయ్యారు. ఖుర్ధా–బొలంగీర్ 57వ నంబరు జాతీయ రహదారిపై నిలకడగా నిలిచి ఉన్న ట్రక్కుని కారు ఢీకొన్న ప్రమాదంలో మృతుని కొడుకు, కోడలు మృతి చెందారు. తండ్రి అంత్యక్రియలు నిర్వహించేందుకు భార్యతో కలిసి వెళ్తుండగా కారు ట్రక్కుని ఢీకొనడంతో దంపతులు ఘటన స్థలంలోనే ప్రాణాలు కోల్పోయారు. బౌధ్ జిల్లా రంభికట టోల్‌గేట్ సమీపం నువాపడా కూడలి ప్రాంతంలో ఈ విషాదం చోటు చేసుకుంది. మృతులు నయాగడ్ గొణియా ప్రాంతానికి చెందిన రాజ్‌కిషోర్, మీనాక్షి సాహుగా గుర్తించారు. మరో దుర్ఘటనలో ట్రక్కు దూసుకెళ్లి మహిళా హోమ్ గార్డు దుర్మరణం పాలైంది. సైకిల్‌పై వెళ్తున్న మహిళా హోమ్ గార్డుపై ట్రక్కు దూసుకుని పోవడంతో దుర్మరణం పాలైంది. కటక్ నగరం ఛత్ర బజార్ అర్బన్ హట్ సమీపంలో ట్రక్కు హోం గార్డుపైకి దూసుకెళ్లింది. మృతురాలు మనోరమ పండాగా గుర్తించారు. ఆమె మాల్ గోదాం పోలీస్ ఠాణాలో హోమ్ గార్డుగా పనిచేస్తోంది. ఆమె తన విధిని ముగించుకుని ఇంటికి తిరిగి వస్తుండగా ప్రమాదం జరిగింది. బస్సు స్కూటర్‌ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. కటక్ బాదంబాడి నుంచి లింక్ రోడ్ వెళ్తున్న స్కూటీని లింక్ రోడ్ మధుపట్న కూడలి వద్ద బస్సు స్కూటర్‌ను ఢీకొనడంతో యువకుడు మృతి చెందాడు. మృతుని ఆచూకీ తెలియాల్సి ఉంది.