కొరాపుట్: జయపూర్ పట్టణంలో దోపిడీ దొంగలు పట్టపగలు చెలరేగిపోయారు. గురువారం సాయంత్రం బెల్ రోడ్డులో ప్రజలందరూ చూస్తుండగా దోపిడీ చేశారు. హడియా గ్రామానికి చెందిన గిరిజన రైతు కమలోచన్ బోత్ర తనకు ప్రభుత్వం నుంచి అందిన రు.3.9 లక్షల నగదు ఎంజీ రోడ్డులోని షిర్డీ సాయి మందిరం సమీపంలోని ఎస్‌బీఐ మెయిన్ బ్రాంచ్‌లో డ్రా చేశాడు. తనతో వచ్చిన గిరిజనులతో కలిసి బెల్ రోడ్డు గుండా రాజానగర్ వెళ్లి హడియా గ్రామానికి వెళ్లాలని బయలుదేరాడు. వాహనం బెల్ రోడ్డులో వెళ్తుండగా సొంబారు తోట సమీపంలో పంచముఖ హనుమన్ విగ్రహ సమీపంలో ముగ్గురు యువకులు రోడ్డుకు అడ్డంగా వచ్చి వాహనం ఆపారు. ఒక యువకుడు బోలిరోలో ఉన్న నగదు సంచి లాగడానికి ప్రయత్నం చేశాడు. అప్పటికే తేరుకున్న కమలోచన్ బోత్ర సంచి గట్టిగా పట్టుకున్నాడు. బోలోరోలో ఉన్న మిగతా గిరిజనులు స్పందించే లోపు రు.లక్ష నగదు (రెండు యాబై వేల కట్టలు) పట్టుకొని పరారయ్యారు. బాధితుడు పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఎస్‌బీఐలో గిరిజనులు డబ్బులు డ్రా చేసినప్పటి నుంచి దొంగలు అనుసరిస్తున్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.