
శ్రావణ మాస భోల్ భం ఏర్పాట్లు పరిశీలన
కొరాపుట్: శ్రావణ మాసంలో వేలాది మంది భక్తులు భోల్ భం యాత్రకు తరలి రానున్న నేపథ్యంలో అందుకుతగ్గట్టుగా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. శ్రావణ మాసంలోని ప్రతి సోమవారం సుమారు 30 వేల మంది భక్తులు కాలి నడకన భోల్‌భం యాత్ర చేస్తూ గుప్తేశ్వరం చేరుకుంటారు. ఈ నేపథ్యంలో సహజ సిద్ధ పుణ్య క్షేత్రం గుప్తేశ్వరం క్షేత్రాన్ని కొరాపుట్ జిల్లా కలెక్టర్ వి.కీర్తి వాసన్ మంగళవారం ఆకస్మికంగా సందర్శించారు. బోయిపరిగుడ సమితి రామగిరి పంచాయతీలోని దండకారణ్యంలో ఉన్న ఈ క్షేత్రానికి తరలి వెళ్లారు. అక్కడ కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మితమవుతున్న ఆర్డీ విభాగ రహదారులు, నడక మార్గాలు, కాటేజీలు, భవనాలు పరిశీలించారు. శబరి నది వద్ద భక్తులకు అందాల్సిన సదుపాయాలపై ఆరా తీశారు. ముందస్తు సమాచారం లేకుండానే భారీ వర్షంలో కలెక్టర్ రావడం అధికారులకు ముచ్చెమటలు పట్టించింది. స్వయంగా గొడుగు వేసుకొని అరణ్య ప్రాంత నిర్మాణాల పురోగతిని కలెక్టర్ తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట జయపూర్ సబ్ కలెక్టర్ ఆకవరం సస్య రెడ్డి, ఇతర అధికారులు ఉన్నారు.
గుప్తేశ్వరం క్షేత్రాన్ని సందర్శించిన కలెక్టర్

శ్రావణ మాస భోల్ భం ఏర్పాట్లు పరిశీలన