
జగన్నాథుని రథయాత్ర
చిలికా సరస్సులో ..
భువనేశ్వర్: ఏటా శ్రీ క్షేత్రంలో రథ యాత్ర జరిగే రోజున చిలికా సరసులో స్వామి రథ యాత్ర నిర్విఘ్నంగా కొనసాగుతోంది. ఏటా చిలికా సరస్సు జలాలపై స్వామి యాత్ర జరుగుతుంది. శతాబ్దాలుగా ఈ యాత్ర నిరవధికంగా కొనసాగుతున్నట్లు సమాచారం. ఖుర్ధా జిల్లా చిలికా సరస్సులో సుందరమైన కొంకొణొ శిఖారి ద్వీపం జగన్నాథుని జల రథ యాత్ర స్థలం. చిలికా సరసు జలాలపై స్వామి రథ యాత్ర ఉత్కంఠభరితంగా కొనసాగుతుంది.
స్వామి యాత్రతో నిశ్చలమైన చిలికా సరసు కొంకొణొ శిఖారి ద్వీపం పరిసరాలు మేళ తాళాలు, మృదంగం, ఘంటానాదంతో మారు మోగడంతో ఆధ్యాత్మిక వాతావరణం అలముకుంటుంది. బలభద్రుడు, దేవీ సుభద్ర, శ్రీ జగన్నాథుడిని సర్వాంగ సుందరంగా అలంకరించి పడవ రథంపై చిలికా సరసు నీలి జలాల మీదుగా యాత్ర నిర్వహించడం ప్రత్యేక అనుభూతిని మిగుల్చుతుంది. యాత్ర పడవ రథం ఆకర్షణీయంగా రూపుదిద్దుకుని కొంకొణొ శిఖారి ద్వీపం చుట్టూ ప్రదక్షిణలు చేయడంతో స్వామి యాత్ర ముగుస్తుంది.
దాడులు ప్రభావం
ఈ విభిన్నమైన రథ యాత్ర చరిత్ర పుటల్లో చోటు చేసుకుంది. పూరీలోని శ్రీ జగన్నాథ ఆలయంపై గతంలో 18 సార్లు దాడులు జరిగినట్లు సమాచారం. ఆయా సందర్భాల్లో రక్షణ కోసం దేవతా మూర్తులను చిలికా సరస్సులోని నొయిరి ఘాట్ కొంకొణొ శిఖారీ ద్వీపానికి 2 సార్లు తరలించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. 1731లో ముస్లిం పాలకుడు తాకీ ఖాన్ పూరీలోని శ్రీ మందిరంపై దాడి చేసి ఆక్రమించినప్పుడు భద్రంగా పదిలపరిచేందుకు రత్న వేదికపై మూల విరాట్లు శ్రీ జగన్నాథుడు, బలభద్ర స్వామి, దేవీ సుభద్రతో చక్రరాజు సుదర్శనుని రహస్యంగా చిలికా సరసుకు తరలించారు. ఈ ప్రాంతం దట్టమైన అడవులుతో కూడుకొని ఉండడంతో సురక్షితంగా భావించి దేవుళ్లని ఇక్కడకు తరలించారు. ఈ అటవీ ప్రాంతంలో కొంకొణి అనే పండ్లు మినహా ఇతర పదార్థాలు లభ్యం కానందున వీటినే నిత్యం నైవేద్యంగా సమర్పించి ఆరాధించి రక్షణ కల్పించారు. ఈ చర్యతో స్వామి నెలకొన్న ద్వీపం కొంకొణొ శిఖారి ద్వీపంగా భాసిల్లుతుంది. అది మొదలుకొని ఈ ద్వీపంలో శ్రీ జగన్నాథుని పూజాదులు ఆచారం ప్రకారం నిర్వహిస్తున్నారు.
సందర్శకులకు సదుపాయాలు
చిలికా సరసులో స్వామి రథ యాత్ర ప్రత్యక్షంగా తిలకించేందుకు భక్తులు తరలి వస్తారు. వీరంతా తీరానికి పరిమితం కాకుండా సరసులో యాత్ర పడవతో తిరుగాడేందుకు పడవ సౌకర్యం కల్పిస్తారు. ఈ సందర్భంగా నొయిరీ ఘాట్ నుంచి కొంకొణొ శిఖారి ద్వీపం వరకు భక్తులను తీసుకెళ్లడానికి ఉచిత పడవలు ఏర్పాటు చేస్తున్నారు. స్థానిక పోలీసు యంత్రాంగం యాత్ర సజావుగా, సురక్షితంగా నిర్వహించేందుకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తుంది. కొంకొణొ శిఖారీ ట్రస్ట్ భక్తుల కోసం విస్తృతమైన ఏర్పాట్లు చేసింది. ఉచిత రవాణాతో ప్రసాద వితరణ చేసింది. మహా ప్రభువు రథ యాత్ర భక్తులు, భగవంతుని అద్వితీయ కలయికకు ఈ యాత్ర నిలువెత్తు తార్కాణం.

జగన్నాథుని రథయాత్ర