
మత్స్యావతారంలో జగన్నాథుడు
రాయగడ: రథయాత్రలో భాగంగా గుండిచా మందిరంలో కొలువుదీరిన దేవతామూర్తులు జగన్నాథ ,బలభద్ర, సుభద్రలు భక్తులకు దర్శనం ఇస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నాడు మత్స్యావతారంలో జగన్నాథుడు భక్తులకు దర్శనమిచ్చాడు.
భారీ వర్షంతో నిలిచిన రథాలు
జయపురం: పూర్వకాలం నుంచి వస్తున్న ఆచారం ప్రకారం ఒకరోజు ఆలస్యంగా జయపురంలో శనివారం రథయాత్ర ప్రారంభమైంది. అయితే రథాలు వెల్‌కం జంక్షన్ వద్దకు చేరుకునే సమయానికి భారీగా వర్షం కురవడంతో అక్కడే నిలిచిపోయాయి. అనంతరం సాయంత్రం 6 గంటల సమయంలో వర్షం తగ్గడంతో మరలా రథాలు పయనం సాగించి గుండిచా మందిరానికి చేరాయి. యాత్రంలో జయపురం ఎమ్మెల్యే తారాప్రసాద్ బాహిణీపతి, మున్సిపల్ చైర్మన్ నరేంద్ర కుమార్ మహంతి తదితరులు పాల్గొన్నారు.
విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం
జయపురం: కూరగాయల తోటలో విద్యుత్ షాక్‌తో మహిళ దుర్మరణం పాలైన ఘటన జయపురం సదర్ పోలీసుస్టేషన్ పరిధి గొడొపొదర్ ప్రాంతంలోని ఏకతాగుడ గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. ఏకతాగుడ గ్రామంలో బిద్యుత్ మండల్ తన కాయగూరల పంటను పశువుల నుంచి రక్షించుకునేందుకు కంచె వేసి విద్యుత్ కనెక్షన్ ఇచ్చాడు. అయితే అతడి భార్య ప్రియాంక మండల్ తోటకు వెళ్లింది. ఆ సమయంలో అకస్మాత్తుగా విద్యుత్ ప్రసారం కావడంతో ప్రియాంక విద్యుత్ షాక్‌కు గురై కింద పడిపోయింది. వెంటనే ఆమెను జయపురం జిల్లా కేంద్ర ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మరణించినట్లు ధ్రువీకరించారు. సమాచారం అందడంతో సదర్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సదర్ పోలీసు అధికారి సచీంద్ర ప్రధాన్ వెల్లడించారు.
గర్భిణికి డోలీ కష్టాలు! ●
● డోలీలో ఐదు కిలో మీటర్లు
మోసుకొచ్చిన కుటుంబ సభ్యులు
కొరాపుట్: గర్భిణిని డోలీలో ఐదు కిలో మీటర్లు తరలించిన విషాదకర ఘటన చోటుచేసుకుంది. కొరాపుట్ జిల్లా జయపూర్ సబ్ డివిజన్ కెబిడి గ్రామ పంచాయతీ కుసుంబోట గ్రామానికి చెందిన త్రినాఽథ్ ముదలి భార్య రైలీ ముదలికి శనివారం పురిటి నొప్పులు వచ్చాయి. ఆ గ్రామానికి రోడ్డు సదుపాయం లేదు. దీంతో మంచాన్ని డోలీగా చేసుకొని గిరిజనులు ఐదు కిలో మీటర్లు తరలించారు. మార్గమధ్యలో భారీ వర్షంతో పాటు కొండలు, గుట్టలు, అడవులు, నదులు దాటి ఆస్పత్రికి మోసుకొని వచ్చారు. అనంతర ప్రభుత్వ ఆస్పత్రిలో ఆడ బిడ్డకి రైలీ ముదలి జన్మనిచ్చింది. తల్లీబిడ్డలు ఆరోగ్యంగా ఉన్నారని వైద్యులు ప్రకటించారు.

మత్స్యావతారంలో జగన్నాథుడు