
నిఘంటువు ఆవిష్కరిస్తున్న సీఎం నవీన్ పట్నాయక్ తదితరులు
భువనేశ్వర్: గిరిజన సంస్కృతిని ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సంతాలీ భాషపై నిఘంటువును ఆదివారం విడుదల చేశారు. ఆయన ఉంటున్న నవీన్ నివాస్‌లో జనజాతి భాషా సాంస్కృతిక ప్రతిష్టాన్ ప్రచురించిన సంతాలి – ఒడియా – ఆంగ్ల నిఘంటువును ఆవిష్కరించారు. ఇతర భాషావేత్తల సాయంతో సంతాలి భాషపై ప్రముఖ నిపుణుడు చైతన్య ప్రసాద్ మాఝీ ఈ నిఘంటువును రూపొందించారు. ఈ సందర్భంగా ప్రాథమిక తరగతులకు సంబంధించి సవర, కోయ, గోండి, ముండా 4 గిరిజన భాషల్లో రాసిన 21 పాఠ్య పుస్తకాలను సైతం నవీన్ పట్నాయక్ విడుదల చేశారు. కార్యక్రమానికి హాజరైన గిరిజన సంఘాల ప్రతినిధులను ఉద్దేశించి ముఖ్యమంత్రి మాట్లాడుతూ సంతాలి భాషపై అవగాహన కల్పించేందుకు నిఘంటువు ఎంతో దోహదపడుతుందన్నారు. గిరిజన భాషల్లోని పుస్తకాలు విద్యార్థులను పాఠశాల విద్యవైపు ఆకర్షిస్తాయని తెలిపారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో సంతాలీ భాష స్థానం చేజిక్కించుకుందన్నారు. మరో 11 గిరిజన భాషల్లో ప్రాథమిక పాఠ్య పుస్తకాలను ప్రచురించేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల అభివృద్ధి, మైనారిటీలు మరియు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ మంత్రి జగన్నాథ్ సరకా, ఆ శాఖ కార్యదర్శి రూపా రోషన్ సాహు, డైరెక్టర్ ఇంద్రమణి త్రిపాఠి తదితరులు పాల్గొన్నారు.
సంతాలి–ఒడియా–ఆంగ్లం నిఘంటువు
ఆవిష్కరణ