
ప్రైవేట్ బస్సు యజమాన సంఘ సమావేశంలో మాట్లాడుతున్న మహంతి
● లక్ష్మీ పథకానికి నిరసనగా నిర్ణయం ● వేరే కంపెనీకి బాధ్యతలు అప్పగించడంపై విస్మయం
జయపురం: మల్కన్‌గిరి జిల్లాలో నేటి నుంచి ప్రారంభమవ్వనున్న లక్ష్మీ పథకాన్ని అవిభక్త కొరాపుట్ జిల్లా ప్రైవేట్ బస్సుల యజమానుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ పథకంలో భాగంగా బస్సులను నడిపేందుకు వేరే కంపెనీకి బాధ్యతలు అప్పగించడం సమంజసం కాదని పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక ప్రైవేట్ బస్సు యజమానుల కార్యాలయంలో అవిభక్త కొరాపుట్ జిల్లా బస్సు యజమానుల సంఘ సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా జయపురం మున్సిపల్ చైర్మన్, బస్సు యజమానుల సంఘ నేత నరేంద్రకుమార్ మహంతి మాట్లాడుతూ.. లక్ష్మీ పథకాన్ని తాము స్వాగతిస్తున్నామన్నారు. అయితే ఆ పథకం అమలు చేసే బాధ్యతను మహారాష్ట్ర రాష్ట్రానికి చెందిన ఒక కంపెనీకి ఇవ్వడంపై వ్యతిరేకిస్తున్నట్లు తెలియజేశారు. బస్సులు రూట్లలో సడపడం దగ్గర నుంచి, ఉద్యోగులను నియమించడం వరకు ఆ కంపెనీయే చూస్తుందని వివరించారు. బస్సుల్లో ఎంత ఆదాయం వస్తుందో అంతా ప్రభుత్వానికి ఇస్తుందని, ప్రభుత్వం ఒప్పందం ప్రకారం బస్సులను సమకూర్చిన కంపెనీలకు డబ్బు చెల్లిస్తుందని వివరించారు. అయితే ఈ పథకంలో బస్సుల నిర్వహణ బాధ్యతలు ప్రైవేట్ బస్సుల యజమానులకు అప్పగిస్తే అందరూ లబ్ధి పొందగలరని అభిప్రాయం వ్యక్తం చేశారు. లేనిచో ప్రైవేట్ బస్సు యజమానులు కొన్నటువంటి కొత్త బస్సులను ప్రభుత్వం తీసుకొని నడిపినా బాగుంటుందన్నారు.
ప్రభుత్వానికి సహకరిస్తున్నాం
ప్రైవేట్ బస్సుల యాజమాన్యం ఎల్లప్పుడూ ప్రభుత్వానికి సహకరిస్తోందని మహంతి గుర్తు చేశారు. ఎన్నికల సమయం నుంచి ప్రభుత్వ కార్యక్రమాలకు ప్రైవేట్ బస్సులను సమకూర్చుతున్నామన్నారు. రోడ్లు బాగోలేకపోయినా గ్రామీణ ప్రాంతాలకు, నక్సల్ ప్రభావిత ప్రాంతాలకు ప్రైవేట్ బస్సులు నడుపుతూ, ప్రజలకు ప్రయాణ సౌకర్యాలు కల్పిస్తున్నామని వెల్లడించారు. దీనివలన నష్టాలు వచ్చినా భరిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వానికి టాక్స్‌లు కడుతున్నామని, అయినా ప్రభుత్వం ప్రైవేట్ బస్సుల యజమానులను చిన్నచూపు చూస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. లక్ష్మీ పథకం బాధ్యతలను వేరే కంపెనీకి ఇవ్వడానికి నిరసనగా సోమవారం ఉదయం 6 గంటల నుంచి 3వ తేదీ మంగళవారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలు బస్సులు నిలిపివేసేందుకు తమ అసోసియేషన్ నిర్ణయించినట్లు వెల్లడించారు. అప్పటికీ ప్రభుత్వం నిర్ణయం తీసుకోకపోతే ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. సమావేశంలో నవరంగపూర్, ఉమ్మరకోట్, మల్కన్‌గిరి, రామగడ, కొరాపుట్, సెమిలిగుడ, జయపురం ప్రైవేట్ బస్సు యజమాన సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

ప్రైవేట్ బస్టాండ్‌లో నిలిచిన బస్సులు