ప్రైవేటు దోపిడీ! | - | Sakshi
Sakshi News home page

ప్రైవేటు దోపిడీ!

Jun 26 2025 6:31 AM | Updated on Jun 26 2025 6:33 AM

పుస్తకాల పేరుతో బడి తెగించి వ్యాపారం

వన్‌టౌన్‌(విజయవాపశ్చిమ): ఉమ్మడి కృష్ణాజిల్లాలో పలు ప్రైవేట్‌ విద్యాసంస్థలు పుస్తకాల పేరుతో విద్యార్థులను దోపిడీ చేస్తున్నాయి. జూన్‌ మాసం విద్యాసంస్థలు పునఃప్రారంభం కాగానే ప్రైవేట్‌ పాఠశాలల యాజమాన్యాలు పుస్తకాల వ్యాపారాన్ని ప్రారంభించాయి. ఉమ్మడి జిల్లాలో వందల సంఖ్యలో ఉన్న ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఈ పుస్తకాల వ్యాపారం మూడు పువ్వులు.. ఆరు కాయలుగా విరాజిల్లుతోంది. ప్రైవేట్‌ పాఠశాలలో చేరిన ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకూ చదువుతున్న ప్రతి ఒక్క విద్యార్థి తప్పనిసరిగా అదే విద్యాసంస్థలో పుస్తకాలు కొనుగోలు చేయాల్సిందే. లేకుంటే ఆ విద్యార్థి ఆ విద్యాసంస్థలో చదువుకోడానికి అనర్హుడిగా మారిపోతాడు. విద్యార్థులు పుస్తకాలు కొనుగోలు చేసినప్పుడే ఆ యజమాన్యం సైతం వారిని పాఠశాలలోకి అనుమతిస్తున్నట్లుగా పలువురు విమర్శిస్తున్నారు.

రూ. 25వేల వరకూ వసూళ్లు..

ఉమ్మడి కృష్ణా జిల్లాలో సుమారుగా 933 ప్రైవేట్‌ విద్యాసంస్థలు పని చేస్తున్నాయి. అందులో సుమారుగా 3,47,271మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్తున్నారు. దాదాపు అన్ని విద్యాసంస్థల్లో ఈ పుస్తకాలు, స్టేషనరీ వ్యాపారాన్ని ఆయా యాజమాన్యాలు బహిరంగంగానే నిర్వహిస్తున్నాయి. ఒక్కొక్క విద్యార్థి నుంచి నోటు పుస్తకాలు, టెక్ట్స్‌ బుక్స్‌, వర్క్‌ పుస్తకాలు, ఇతర స్టేషనరీ పేర్లతో ఆయా యాజమన్యాలు ఆరు వేల నుంచి రూ.20 వేల వరకూ.. అదే స్కూల్‌ యూనిఫామ్‌, బూట్లు ఇతర వస్తువులతో కలిపి అయితే రూ.25 వేల వరకూ కొన్ని విద్యాసంస్థలు విక్రయాలు చేస్తున్నాయి. పాఠశాల స్థాయి, తరగతిని బట్టి ఆయా మొత్తాలను పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ముక్కుపిండి మరీ వసూలు చేస్తున్నాయి.

పెద్ద విద్యాసంస్థల్లో మరీ దారుణం..

జిల్లాలోని కొన్ని విద్యాసంస్థల్లో కేవలం పుస్తకాల విక్రయాలపైనే కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యం కలుగక మానదు. జిల్లాలో రెండు, మూడు వేలకు పైగా విద్యార్థులు ఉన్న విద్యాసంస్థల్లో ఒక్కొక్కరి నుంచి పది వేల చొప్పున పుస్తకాల విక్రయాలు జరిగితే కోట్లాది రూపాయల మేర వ్యాపారం జరిగినట్లేనని విద్యార్థులు తల్లిదండ్రులు వ్యాఖ్యానిస్తున్నారు. పుస్తకాలపై సుమారుగా 30 నుంచి 50 శాతం లాభం ఉంటుందని పలువురు వివరిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు మూడు వందలకు పైగా విద్యాసంస్థల్లో సుమారు రెండు వేల మంది విద్యార్థులు ఉన్న సంస్థలు ఉన్నట్లుగా విద్యార్థి సంఘాల నేతలు చెబుతున్నారు. ఇంత పెద్ద వ్యాపారం జరుగుతుంటే ప్రభుత్వం ఎటువంటి దృష్టి పెట్టకపోవటంపై అనేక ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

కాదంటే వెళ్లిపోండి..

‘మా పాఠశాలలో చదివే విద్యార్థులకు మేమే పుస్తకాలు అమ్ముతాం. లేదంటే మీ పిల్లలను తీసుకువెళ్లిపోండి’ అంటూ విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను బెదిరింపులకు పాల్పడుతున్నాయి. దాంతో చేసేది లేక అప్పులు చేసి మరి తల్లిదండ్రులు పుస్తకాలను కొనుగోలు చేస్తున్నారు. దీనిపై ఇటీవల విద్యార్థి సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. అయితే పోలీసులు వారిని అక్కడి నుంచి తరిమేశారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దాదాపుగా అన్ని ప్రైవేట్‌ పాఠశాలల్లో ఇదే తరహా వ్యాపారం జరుగుతోంది. చిన్నచిన్న విద్యాసంస్థలు సాధారణ ధరలకు విక్రయిస్తున్నా, పాఠశాల గుడ్‌విల్‌, స్థాయి పెరిగే కొద్దీ ఈ ధరలు పెరుగుతున్నాయని విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మామూళ్ల

మత్తులో

అధికారులు..

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఇంత పెద్ద తరహాలో విద్యాసంస్థల్లో అనధికారికంగా కోట్లాది రూపాయల మేర పుస్తకాల విక్రయాలు జరుగుతుంటే విద్యాశాఖ ఏ మాత్రం స్పందించటం లేదు. విద్యాశాఖ ఆయా యాజమాన్యాలు అందించే మామూళ్ల కోసం నిబంధనలను పక్కన పెడుతున్నారని పలువురు ఆరోపిస్తున్నారు. ఎవరైనా అధికారి దృష్టికి తీసుకువెళ్తే తమకు ఫిర్యాదు వస్తే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారని విద్యార్థి సంఘాలు చెబుతున్నాయి. అయితే జూన్‌ మాసంలో ఏ ప్రైవేట్‌ విద్యాసంస్థలోకి వెళ్లినా పుస్తకాల విక్రయాలు బహిరంగంగానే కనిపిస్తాయని వారు వివరిస్తున్నారు. తనిఖీ చేయాల్సిన స్థానిక మండల విద్యాశాఖ అధికారులు ఈ దందాకు అండగా నిలుస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ప్రైవేటు విద్యా సంస్థల వివరాలు..

ఎన్టీఆర్‌ జిల్లా:

ప్రాథమిక: 16

ప్రాథమికోన్నత:156

ఉన్నత: 337

మొత్తం పాఠశాలలు: 509

మొత్తం విద్యార్థులు: 2,21,914 మంది

కృష్ణా జిల్లా:

ప్రాథమిక: 114

ప్రాథమికోన్నత: 103

ఉన్నత: 207

మొత్తం పాఠశాలలు: 424

మొత్తం విద్యార్థులు: 1,25,357 మంది

ప్రైవేటు, కార్పొరేటు విద్యా సంస్థల్లో దందా రూ.6 నుంచి రూ.25 వేల వరకూ వసూళ్లు పెద్ద విద్యాసంస్థల్లో కోట్ల రూపాయల్లో వ్యాపారం తమ దగ్గరే తీసుకోవాలంటూ తల్లిదండ్రులపై ఒత్తిడి మామూళ్ల మత్తులో విద్యాశాఖ అధికారులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement