
కారు దగ్ధం
పటమట(విజయవాడతూర్పు): ఓ ఆకతాయి చేసిన పనికి లక్షలు విలువ చేసే కారు దగ్ధమయింది. వివరాల ప్రకారం పటమట పోలీస్‌స్టేషన్ పరిధిలోని కరెన్సీనగర్‌లో ఉన్న ఆయుష్ ఆస్పత్రికి శుక్రవారం ఇబ్రహీంపట్నం మండలం గుంటుపల్లికి చెందిన పి.ప్రవీణ్ తన కుటుంబ సభ్యులతో కలిసి చికిత్స నిమిత్తం కారులో వచ్చి కుటుంబ సభ్యులను ఆస్పత్రి ముందు దింపి పక్కనే ఉన్న ఖాళీస్థలంలో పార్కింగ్ చేశారు. అదే సమయంలో అక్కడ గుర్తుతెలియని ఓ ఆకతాయి సిగరెట్టును తాగి ఆర్పకుండా అక్కడ ఉన్న చెత్తలో వేయటంతో మంటలు చెలరేగి కారుకు అంటుకున్నాయి. స్థానికులు చూసి పెద్దగా కేకలు వేయటంతో కారు యజమాని వచ్చి కారు తీసే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే కారంతా దట్టమైన మంటలు వ్యాపించాయి. స్థానికులు ఆటోనగర్ ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే కారు కాలి బూడిదయింది. ఈ ప్రమాదంలో రూ.10 లక్షల మేరకు ఆస్తినష్టం జరిగిందని ఫైర్ సిబ్బంది తెలిపారు. పటమట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆకతాయి కాల్చిపడేసిన సిగరెట్ కారణం?