
నందిగామ: భక్తులు సమర్పించిన కానుకల ద్వారా సత్యమ్మవారికి రూ.26.65 లక్షల ఆదాయం సమకూరింది. మండల పరిధిలోని అంబారుపేటలో వేంచేసియున్న శ్రీ సత్యమ్మ వారి ఆలయంలోని హుండీల్లోని ఆదాయాన్ని బుధవారం దేవదాయ, ధర్మదాయ శాఖాధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. మొత్తం 6 నెలల 22 రోజులకు గాను రూ.26,65,942 ఆదాయం లభించినట్లు ఆలయ కార్య నిర్వహణాధికారి నాగరాజు తెలిపారు. డివిజన్ తనిఖీదారు అనురాధ, ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ శ్రీనివాసరావు పాల్గొన్నారు.
పేరంటాలమ్మ హుండీ ఆదాయం రూ. 10.18లక్షలు
రామవరప్పాడు(గన్నవరం): విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు శ్రీ వెంకమ్మ పేరంటాలమ్మ ఆలయంలోని హుండీలను బుధవారం లెక్కించగా రూ. 10,18,913 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి పి. లోకేశ్వరి తెలిపారు. భక్తులు అమ్మవార్లకు కానుకల రూపంలో హుండీల్లో సమ ర్పించిన ఆదాయాన్ని దేవదాయశాఖాధికారి చల్లం రాజు సమక్షంలో లెక్కించారు. ఈ సందర్భంగా లోకేశ్వరి మాట్లాడుతూ 2నెలల 15 రోజులకు గానూ హుండీలను లెక్కించగా పై ఆదాయం వచ్చినట్లు వివరించారు.
స్మార్ట్ ఫోన్లకు మరమ్మతులు
చిలకలపూడి(మచిలీపట్నం): గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్లకు సరఫరా చేసిన స్మార్ట్‌ఫోన్లకు మరమ్మతులు చేపట్టనున్నట్లు కలెక్టర్ పి. రంజిత్‌బాషా బుధవారం తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు చేర్చేందుకు గానూ గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో పాటు వలంటీర్లకు స్మార్ట్‌ఫోన్లను సరఫరా చేయటం జరిగిందన్నారు. అయితే మరమ్మతులు చేయాల్సిన మొబైల్ ఫోన్లకు ఈ నెల 16 నుంచి 18వ తేదీ వరకు సర్వీస్ సెంటర్లను నాలుగు చోట్ల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. గుడివాడలోని సెల్ఫీ టెక్నో సర్వీసెస్, మచిలీపట్నంలోని లక్ష్మీగణపతి కమ్యూనికేషన్స్, విజయవాడలో క్యూడీజీ సర్వీసెస్ లిమిటెడ్, సుమన్ టెలికాం సర్వీసెస్ సెంటర్లలో ఈ మూడు రోజులు మరమ్మతులు చేస్తారన్నారు.
పీహెచ్‌డీ కోర్సుల్లో
స్పాట్ అడ్మిషన్‌లు
కోనేరుసెంటర్(మచిలీపట్నం): కృష్ణా విశ్వవిద్యాలయంలో పీహెచ్‌డీ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్లకు సంబంధించి స్పాట్ అడ్మిషన్‌లు చేపడుతున్నామని డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ డైరెక్టర్ డాక్టర్ ఆర్. కిరణ్‌కుమార్ బుధవారం తెలిపారు. ఈ నెల 20వ తేదీ సోమవారం ఉదయం 10 గంటల నుంచి 11 గంటలలోగా రిపోర్టు చేసిన అభ్యర్థులకు మాత్రమే ప్రక్రియ నిర్వహించనున్నట్లు చెప్పారు. బయోటెక్నాలజీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, కామర్స్, ఫిజిక్స్, మేథమెటిక్స్, ఇంగ్లిష్, బిజినెస్ మేనేజ్‌మెంట్ కోర్సుల్లో సీటు పొందాలనుకునే అభ్యర్థులు ఏపీఆర్‌సెట్–2022 ర్యాంకుతో పాటు ఒరిజినల్ ధ్రువీకరణ పత్రాలను అందజేయాలన్నారు. ఇతర సమాచారం కోసం http:// www.kru.ac.in/ సంప్రదించాలని సూచించారు. అలాగే 9440872455 నెంబరును సంప్రదించవచ్చునన్నారు. కుదరనిపక్షంలో dokaru@gmail.comకి ఈ–మెయిల్ చేయవచ్చునని వివరించారు.
వినియోగదారుల హక్కులపై అవగాహన అవసరం
చిలకలపూడి(మచిలీపట్నం): నాణ్యమైన వస్తు సేవలు పొందే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని కృష్ణా జేసీ అపరాజితాసింగ్ అన్నారు. కలెక్టరేట్‌లోని సమావేశపు హాలులో బుధవారం సాయంత్రం జిల్లా పౌరసరఫరాలశాఖ ఆధ్వర్యంలో ప్రపంచ వినియోగదారుల హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేసీ మాట్లాడుతూ వినియోగదారుల హక్కులు, అవసరాల గురించి ప్రజల్లో అవగాహన కలిగించేందుకు ఏటా మార్చి 15వ తేదీన ఈ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామన్నారు. వస్తువుల నాణ్యత, స్వచ్ఛత, సామర్థ్యం, ధర, ప్రమాణాలకు సంబంధించిన పరిజ్ఞానంపై వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలన్నారు. జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి వి. పార్వతి, జిల్లా కన్జ్యూమర్స్ అధ్యక్షుడు సీహెచ్ కిషోర్‌కుమార్, జిల్లా రవాణాధికారి సీతాపతిరావు తదితరులు పాల్గొన్నారు.
