
చికిత్స పొందుతూ గుర్తుతెలియని వ్యక్తి మృతి
ఖలీల్‌వాడి: నగరంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతిచెందినట్లు నాలుగో టౌన్ పోలీసులు తెలిపారు. గత నెల 25న నగరంలోని బింగి ఫంక్షన్ హాల్ సమీపంలో ఒక గుర్తు తెలియని వ్యక్తి అనారోగ్యంతో పడిఉండగా, పోలీసులు గుర్తించి చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈక్రమంలో గురువారం అతడు చికిత్స పొందుతూ మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 55 నుంచి 60ఏళ్ల లోపు ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. మృతుడి ఒంటిపై తెలుపు రంగు షర్ట్, లుంగీ ధరించినట్లు పేర్కొన్నారు. మృతుడి వివరాలు ఎవరికై నా తెలిసినచో నాలుగవ టౌన్ పోలీస్ స్టేషన్‌లో గాని, 87126 59840, 87126 59719ను సంప్రదించాలన్నారు.
ట్రాన్స్‌ఫార్మర్‌ను ఢీకొన్న లారీ
● డ్రైవర్ మృతి
నిజామాబాద్ రూరల్: రూరల్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని కంఠేశ్వర్ బైపాస్ వద్ద రోడ్డు పక్కన ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను ఓ లారీ ఢీకొనడంతో డ్రైవర్ మృతిచెందాడు. వివరాలు ఇలా.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన పర్వేజ్‌ఖాన్ (32) ఆదిలాబాద్‌లోని కేటీపీ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీలో గత ఐదేళ్లుగా లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. నగరంలోని కంఠేశ్వర్ బైపాస్‌లోగల లహరి హోటల్ పక్కన ఓ భవన నిర్మాణం కొనసాగుతుండగా మంగళవారం అతడు లారీలో సిమెంట్ లోడ్‌ను తీసుకువచ్చాడు. ప్రమాదవశాత్తు సమీపంలోని ట్రాన్స్‌ఫార్మర్‌ను లారీ ఢీకొనడంతో డ్రైవర్ పర్వేజ్‌ఖాన్ మృతిచెందాడు.మృతుడి సన్నిహితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొ ని దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ ఎస్‌హెచ్‌వో ఆరీఫ్ గురువారం తెలిపారు.