● జగిత్యాల్ జిల్లా మల్లాపూర్ మండలం మొగిలిపేట్‌కు చెందిన రైతు వంగ శేఖర్ నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ మార్కెట్‌లో 12 క్వింటాళ్ల పసుపును విక్రయించాడు. ఒక్కో క్వింటాలుకు ఈనామ్ ప్రకారం రూ.10,006 ధర నిర్ణయించారు. పసుపును కొనుగోలు చేసిన వ్యాపారి మాత్రం ఒక్కో క్వింటాలుకు రూ.9,500లు మాత్రమే చెల్లిస్తానని స్పష్టం చేశారు. చేసేది లేక రైతు ఈనామ్ ధర కంటే తక్కువ ధరకే పసుపు విక్రయించాడు. ఫలితంగా రూ.6,072 నష్టపోయాడు. కమీషన్ ఏజెంట్‌కు మరో రూ.2,500ల చెల్లించాడు. అంటే వంగా శేఖర్‌కు తన పసుపును విక్రయించి రూ.8,572 తక్కువ పొందాడు. ఇది ఒక్క శేఖర్‌కు ఎదురైన నష్టమే కాదు. నిజామాబాద్ మార్కెట్‌లో పసుపును విక్రయించడానికి వెళ్లిన ఎంతో మంది రైతులకు ఇదే పరిస్థితి ఎదురవుతుండటంతో తీవ్రంగా నష్టపోతున్నారు.
మోర్తాడ్(బాల్కొండ): నిజామాబాద్ మార్కెట్‌లో పసుపు ధరలో గోల్‌మాల్ జరుగుతోంది. ఈనామ్ ట్రేడింగ్‌లో ఒక ధర, మాన్యువల్‌లో మరో ధర ఉండటంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. అయినా మార్కెటింగ్ శాఖ అధికారులు మౌనం వహించడం ఎన్నో సందేహాలకు తావిస్తుంది.
వ్యాపారులు చెప్పిందే ధర..
నిజామాబాద్ మార్కెట్ వరుస సెలవుల తరువాత సోమవారం ప్రారంభమైంది. కానీ ఈనామ్‌తో సంబంధం లేకుండానే గంజ్‌లో వ్యాపారులు ధర నిర్ణయించారు. పసుపు నాణ్యతను బట్టి కొమ్ముకు రూ.10వేల నుంచి రూ.12వేలు, మండకు రూ.8వేల నుంచి రూ.9,800ల వరకూ ధర చెల్లించారు. ఇటీవల ఈనామ్ ప్రకారం ఒక ధర మార్కెట్‌లో మరో ధర వల్ల రైతులు ఆందోళన చేపట్టగా తాజాగా ఈనామ్‌ను పరిగణలోకి తీసుకోలేదని తెలుస్తుంది. రైతులకు ఆశించిన ధర లభించక తీవ్రంగా నష్టపోతున్నారు. ఒక్కో ఎకరం పసుపు సాగుకు రైతులు రూ.1.15లక్షల నుంచి రూ.1.30లక్షల వరకు పెట్టుబడులు పెడుతున్నారు. పసుపు తవ్వడం, ఉడికించడం, ఆరబెట్టి పాలిషింగ్ చేయడం కోసం అదనంగా రూ.50వేల వరకు ఖర్చు చేస్తున్నారు. ఒక్కో ఎకరానికి 30 క్వింటాళ్ల వరకు దిగుబడి రావడంతోపాటు, క్వింటాలు ధర కనీసం రూ.12వేలకు మించి ఉంటేనే రైతుల శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. కానీ ప్రస్తుత ధర రూ.10వేల లోపు ఉండటం, దిగుబడి తక్కువగా రావడంతో రైతులకు తీవ్రంగా నష్టం ఏర్పడుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు పసుపు సాగుపై చిత్తశుద్ధి లేకపోవడంతోనే పసుపు రైతులకు ప్రోత్సాహం కరువైందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వాలు స్పందించి పసుపు సాగు అంశంపై దృష్టిసారించి మద్దతు ధర నిర్ణయించడం, సాగు ఖర్చులు తగ్గేలా అధ్యయనం చేయడంపై చొరవ తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు.
ఈనామ్ ట్రేడింగ్‌లో ఒక ధర,
మాన్యువల్‌లో మరో ధర
రైతులను నమ్మించి మోసగిస్తున్న పసుపు వ్యాపారులు
మద్దతు ధరనే కీలకం..
నిజామాబాద్, నిర్మల్, జగిత్యాల్ జిల్లాల్లోని నేలలు పసుపు సాగుకు ఎంతో అనువైనవి. పసుపు సాగు చేసే రైతులను ప్రోత్సహించాలంటే మద్దతు ధర నిర్ణయమే కీలకమైంది. ప్రభుత్వాలు మద్దతు ధర నిర్ణయించి పక్కాగా అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలి.
– డాక్టర్ కిషన్‌రెడ్డి, వ్యవసాయ శాస్త్రవేత్త
పసుపు ధరలో గోల్‌మాల్