
మీ మెదడు చెప్పే మాట వినండి
నిజామాబాద్‌నాగారం: తలనొప్పిని పని ఒత్తిడిగా... మతిమరుపును వయసు ప్రభావంగా... కళ్ళు తిరగడాన్ని అలసటగా తేలికగా తీసుకుంటాం. ఒక్కోసారి సాధారణ లక్షణాలే మన మెదడులోని ఒక తీవ్రమైన సమస్యకు సంకేతాలు కావొచ్చు. మీ మెదడు మౌనంగా సహాయం కోరుతోందేమో ఎప్పుడైనా ఆలోచించారా..? మెదడు చెప్పే మాట వింటే మనం ముప్పు నుంచి బయటపడొచ్చు. నేడు(ఆదివారం) ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే సందర్భం ప్రత్యేక కథనం..
జిల్లాలో ఇలా...
జిల్లాలో సుమారు 10మంది వరకు న్యూరో సర్జన్‌లు ఉన్నారు. ఒక్కో వైద్యుడి వద్దకు నెలకు 4వరకు బ్రెయిన్ ట్యూమర్‌కు సంబంధించిన రోగులు వస్తున్నారు. నెలకు సుమారు 40మంది వరకు బ్రెయిన్ ట్యూమర్ బాధితులు వైద్యుల వద్దకు ట్రీట్‌మెంట్ కోసం వస్తున్నారు. ఎమ్‌ఆర్‌ఐ స్కానింగ్ చేస్తే ఎలాంటి ట్యూమర్ ఉందో ఇట్లే తెలుసుకోవచ్చు. తద్వారా చికిత్స తీసుకుంటే నయం అవకాశాలు ఎక్కువ.
లక్షణాలు
మీకు మీ కుటుంబసభ్యులకు ఉదయం పూట తరచుగా వచ్చే తీవ్రమైన తలనొప్పులు, వ్యక్తిత్వంలో అకస్మాత్తుగా మార్పులు, చూపు మసకబారడం, మాట తడబడటం, మతిమరుపు లేదా గతంలో ఎప్పుడూ లేని ఫిట్స్ (మూర్ఛలు) వంటి లక్షణాలు ఉంటే గమనించాలి. వీటిని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు. ఇవి బ్రెయిన్ ట్యూమర్ సంకేతాలు కావొచ్చు. వీలైనంత త్వరగా డాక్టర్‌ని సంప్రదించి, అవసరమైన స్కానింగ్‌లు చేయించుకోవాలి.
బ్రెయిన్ ట్యూమరా.. భయం వద్దు
ఎంఆర్‌ఐతో సమస్యను గుర్తించొచ్చు
వైద్యుల చికిత్సతో నయమయ్యే అవకాశం
నేడు ప్రపంచ బ్రెయిన్ ట్యూమర్ డే