వర్ని: మండలంలోని జలాల్పూర్ గ్రామంలోగల మల్లికార్జునస్వామి, కృష్ణ దేవాలయంలో గుర్తు తెలియని వ్యక్తి శనివారం రాత్రి చోరీకి పాల్పడ్డాడు. ఆదివారం ఉదయం ఆలయానికి వచ్చిన భక్తులు చోరీని గమనించి పోలీసులకు సమాచారం అందించారు. దుండగుడు ఐదు తులాల బంగారం, 25 తులాల వెండి, హుండీలోని నగదును ఎత్తుకెళ్లాడు. సీసీ కెమెరా ఫుటేజీలో నిందితుడి దృశ్యం రికార్డయింది. గ్రామస్తులు వర్ని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టారు.
ట్రాన్స్‌ఫార్మర్ కాయిల్స్..
రుద్రూర్: కోటగిరి మండలం కొత్తపల్లి శివారులో ట్రాన్స్‌ఫార్మర్ నుంచి గుర్తుతెలియని దుండగులు కాపర్ కాయిల్స్‌ను ఎత్తుకెళ్లారు. పొలంలో ఉన్న ట్రాన్స్‌ఫార్మర్‌ను దుండగులు కిందపడవేసి అందులోని కాపర్ కాయిల్స్ దొంగిలించారు. ఘటనపై విద్యుత్ అధికారులకు సమాచారం అందించినట్టు రైతులు ఆదివారం తెలిపారు.
పోతంగల్‌లో బైక్..
రుద్రూర్: పోతంగల్ మండల కేంద్రంలో బైక్‌ను గుర్తు తెలియని దుండగులు ఎత్తుకెళ్లారు. వివరాలు ఇలా.. పోతంగల్‌లోని ఆబాది బీసీ కాలనీలోగల కిరాణ షాపు వద్ద రెండు రోజుల క్రితం ఇందూర్ గంగాధర్ తన బైక్‌ను నిలిపాడు. దుకాణంలోకి వెళ్లివచ్చేసరికి దుండగులు బైక్‌ను చోరీ చేశారు. ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు ఆదివారం తెలిపారు.