
మందకొడిగా ‘ఇందిరమ్మ’
● ఇళ్ల నిర్మాణానికి ఆటంకాలు ● పెరిగిన ధరలతో లబ్ధిదారుల ఆందోళన ● ఆషాఢమూ మరో కారణం ● కేటాయించినవి 8,286.. ముగ్గు పోసినవి 3,317
నిర్మల్‌చైన్‌గేట్: పేదల సొంత ఇంటి కలను నిజం చేసేందుకు, స్థలం ఉండి.. ఇళ్లు నిర్మించుకునే ఆర్థిక పరిస్థితి లేనివారికి రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ పథకం మొదటి విడతలో ఇళ్లు మంజూరు చేసింది. నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇళ్లు కేటాయించింది. అయితే జిల్లాలో లబ్ధిదారుల ఎంపికతోపాటు ఇల్లు మంజూరైనవారూ నిర్మాణంలో జాప్యం చేస్తున్నారు. లబ్ధిదారుల ఎంపికలో ఆలస్యం, వెరిఫికేషన్ ప్రక్రియకు సమయం తీసుకోవడం, ప్రొసీడింగ్స్ జారీలో జాప్యం కారణంగా నిర్మాణ ప్రక్రియ మందకొడిగా సాగుతోంది. రెండు నెలల క్రితమే పూర్తి కావాల్సిన లబ్ధిదారుల ఎంపిక ఇప్పటికీ ఇప్పటికీ పూర్తి కాలేదు. ఇళ్లు మంజూరైనవారు ఆర్థిక ఇబ్బందులు, నిర్మాణ సామగ్రి లభ్యత, ధరల పెరుగుదల, ఆషాఢ మాసం కారణంగా నిర్మాణంలో జాప్యం చేస్తున్నారు.
ఆషాఢం ఎఫెక్ట్..
ప్రస్తుతం ఆషాఢమాసం కారణంగా ముహూర్తాలు లేకపోవడంతో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం ఊపందుకోవడానికి మరో నెలకుపైగా సమయం పట్టే అవకాశం ఉంది. ఇంటి వైశాల్యం 400 నుంచి 600 చదరపు అడుగుల మధ్య ఉండాలనే నిబంధన లబ్ధిదారులను ఇబ్బంది పెడుతోంది. ఈ వైశాల్యంలో ఒక హాల్, కిచెన్, బెడ్‌రూమ్, వాష్‌రూమ్ తప్పనిసరిగా ఉండాలి. ఈ పరిమితిని మించి నిర్మాణం చేస్తే ఆర్థికసాయం పొందడానికి అనర్హులవుతారు. ప్రభుత్వ సాయానికీ కొంత డబ్బులు జోడించి విశాలమైన ఇల్లు నిర్మించుకోవాలనుకునే లబ్ధిదారులకు ఈ నిబంధన అడ్డంకిగా మారింది.
పెరిగిన సామగ్రి ధరలు..
రాష్ట్రంలో సిమెంట్, ఐరన్ ధరలు పెరిగాయి. గతంలో రూ.280 ఉన్న సిమెంట్ బస్తా ధర ప్రస్తుతం రూ.330 నుంచి రూ.380 వరకు పెరిగింది. ఐరన్ టన్ను ధర రూ.55 వేల నుంచి రూ.65 వేలకు చేరింది. ఎలక్ట్రికల్ వస్తువులు, కలప, ఇసుక, కంకర ధరలు కూడా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో రూ.5 లక్షలతో కూలీలు, సిమెంట్, ఐరన్, ఇటుక, కంకర ఖర్చులకే సరిపోతున్నాయి. ఇసుక, పెయింట్స్, గుమ్మాలు, కిటికీలు, ఎలక్ట్రికల్, వాటర్ సామగ్రి వంటి వాటికి అదనంగా ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో రూ.5 లక్షల్లో ఇంటి నిర్మాణం పూర్తి కాదని చాలా మంది నిర్మాణాలు మొదలు పెట్టడం లేదు.
హామీగానే తక్కువ ధరలకు సామగ్రి..
తక్కువ ధరలకు సిమెంట్, ఐరన్ పంపిణీ చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ ఇది హామీగానే మారింది. అన్ని గ్రామ పంచాయతీల్లో ఇప్పటికే నిర్మాణాలు ప్రారంభమైనా, సామగ్రి ధరల తగ్గింపు ఊసేలేదు. అధికారులు ఈ విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి తక్కువ ధరలకు సిమెంట్, ఐరన్ అందించేలా చర్యలు తీసుకోవాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
జిల్లాలో మొత్తం వచ్చిన దరఖాస్తులు 1,92,233
మండలాల వారీగా ఈనెల 1వ తేదీ వరకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ వివరాలు
మండలం కలెక్టర్ ముగ్గు
ఓకే చేసినవి పోసినవి
దస్తురాబాద్ 318 189
కడెం 546 348
ఖానాపూర్ 314 254
పెంబి 214 151
బాసర 189 103
భైంసా 400 164
కుభీర్ 754 282
కుంటాల 230 123
లోకేశ్వరం 399 142
ముధోల్ 489 227
తానూర్ 684 228
దిలావర్‌పూర్ 302 104
లక్ష్మణచాంద 333 57
మామడ 727 213
నర్సాపూర్(జి) 372 109
నిర్మల్ 392 118
సారంగాపూర్ 776 326
సోన్ 304 98
నిర్మల్ మున్సిపాలిటీ 430 9
ఖానాపూర్‌మున్సిపాలిటీ 86 72
వివిధ స్థాయిల్లో పనులు..
ప్రొసీడింగ్ ఇచ్చిన మరుసటి రోజు నుంచే ముగ్గులు పోసి ఇళ్ల నిర్మాణాలు ప్రారంభిస్తున్నాం. ఇప్పటికే గ్రామాల్లో ఇళ్ల నిర్మాణాలు వివిధ దశల్లో ఉన్నాయి. కొందరికి బిల్లులు కూడా అందించాం. అన్ని మండలాల్లో పనులు వేగవంతం చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం.
– రాజేశ్వర్, పీడీ, గృహనిర్మాణ శాఖ

మందకొడిగా ‘ఇందిరమ్మ’