
వాణిజ్య పంటలు సాగు చేయాలి
● డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్ ఎ.ప్రేమ్‌సింగ్
లక్ష్మణచాంద: రైతులు వాణిజ్య పంటల సాగుకు ముందుకు రావాలని డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ హార్టికల్చర్, నిర్మల్ జిల్లా ప్రత్యేక అధికారి ఎ.ప్రేమ్‌సింగ్ సూచించారు. లక్ష్మణచాంద మండలం నర్సాపూర్, మామడ మండలం కొరిటికల్ గ్రామాల్లో గురువారం పర్యటించారు. ఉద్యాన పంటల సాగును పరిశీలించారు. నర్సాపూర్(డబ్ల్యూ) గ్రామానికి చెందిన సుశీల ఎకరంలో సాగు చేస్తున్న గైలార్డీయా పూలతోటను పరిశీలించారు. మహిళా రైతుతో మాట్లాడారు. తాను పూలసాగును సంవత్సరం మొత్తం దిగుబడి వచ్చేలా ఒక ప్రణాళికతో వేసుకుంటానని తెలిపింది. రోజుకు రూ.1000 నుంచి రూ.1500 వరకు సంపాదిస్తున్నానని వెల్లడించింది. కిలో పూలకు రూ.40 చొప్పున మార్కెట్ చేస్తానని, సంవత్సరానికి రూ.2 లక్షల ఆదాయం వస్తోందని వివచించింది. అనంతరం మామడ మండలం కొరిటికల్ గ్రామంలో గురుడు రాజేందర్ 8 ఎకరాలలో సాగు చేస్తున్న మిశ్రమ సాగును పరిశీలించారు. బొప్పాయి, అంతర పంటగా పుచ్చ, అరటి, టొమాటో, వంకాయ, మొక్కజొన్న వంటి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా రైతుతో మాట్లాడి వివరాలు సేకరించారు. 2017 నుంచి ఉద్యాన పంటల సాగు చేస్తున్నట్లు తెలిపారు. అధిక ఆదాయం వస్తుందని సంతోషం వ్యక్తం చేశారు. ఉద్యాన శాఖ నుంచి పండ్ల తోటల సాగుకు 40%, మాల్చింగ్ సాగుకు 50% రాయితీ లభించింది తెలిపాడు. జిల్లాలో ఉన్న నేలలు, నీటి వసతి ఉద్యాన పంటల సాగుకు అనుకూలంగా ఉన్నాయని, రైతులను వాణిజ్య పంటల సాగు వైపు మళ్లించాలని ప్రేమ్‌సింగ్ అధికారులను ఆదేశించారు. వివిధ పండ్ల తోటల సాగు చేపడుతున్న రైతుల తోటలలో తక్కువ కాలంలో కోతకు వచ్చే పూలసాగు (బంతి, చామంతి, గులాబీ, గైలార్డీయా) ఆకుకూరల (మెంతి, కొత్తిమీర, తోట కూర), సుగంధ ద్రవ్య (పసుపు, మిరప) పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రతి ఒక్కరూ కూడా తమ ఇంటి ఆవరణలో ఉన్న పెరటి తోటలో కరివేపాకు, నిమ్మ, మునగ, కొబ్బరి, బొప్పాయి లాంటి మొక్కలు నాటుకోవాలన్నారు. కుటుంబానికి కావాల్సిన పోషకాలు పొందవచ్చని తెలిపారు. ఆయన వెంట జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమ శాఖ అధికారి బీవీ.రమణ, ఉద్యానవన అధికారులు మౌనిక, దేవన్న తదితరులు ఉన్నారు.