
ఆయిల్‌పామ్‌కు తెల్లదోమ..!
● చెట్ల పెరుగుదల, దిగుబడిపై ప్రభావం ● యాజమాన్య పద్ధతులతో నియంత్రణ
మామడ: ఆయిల్‌పామ్‌ను తెల్లదోమ ఆశిస్తుండటంతో జిల్లా రైతులను ఉద్యానశాఖ అధికారులు అప్రమత్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో ఈ తెగులు కనిపించిందని అధికారులు పేర్కొంటున్నారు. దీని కారణంగా మొక్కల పెరుగుదల లోపిస్తుంది. దిగుబడులపై ప్రభావం చూపనుంది. తెల్లదోమ నియంత్రణకు జిల్లా ఉద్యానవన శాఖ అధికారి బీవీ రమణ రైతులకు చేస్తున్న సూచనలు..
లక్షణాలు.. నష్టాలు
ఆకుల దిగువ భాగంలో వంకర తిరిగిన తెల్లదోమ గుడ్లు, ఆకులపై తెలుపు మైనపు పదార్థం కనిపిస్తుంది. జిగట పదార్థంతో నల్ల మసి అచ్చు ఏర్పడుతుంది. తెల్లదోమ మొక్కను ఆశించిన అనంతరం వెంటనే మొక్కను చంపదు. కానీ, మొక్క పెరుగుదల, దిగుబడిని తగ్గిస్తుంది. మొక్క నుంచి తెల్లదోమ పోషకాలు నీటిని పీల్చడం ద్వారా ఒత్తిడిని కలి గిస్తుంది. మెరిసే జిగట ద్రవాన్ని విడుదల చేస్తుంది. ఇది నల్ల మసి అచ్చు పెరుగుదలకు దోహదం చేస్తుంది. ఈ జిగట పదార్థం చీమలు, కందిరీగలను ఆకర్షిస్తుంది. ఇవి తెల్లదోమను కాపాడుతాయి.
సహజ నియంత్రణ పద్ధతిలో నివారణ
నీటి ఒత్తిడితో ఆకులను కడగడం ద్వారా దోమ ఉధృతిని తగ్గించవచ్చు. మొక్కలపై గుడ్లు అపరిపక్వ దశలోనే తొలగించాలి. పసుపు రంగు జిగురుతో కూడిన అట్టలు ఉపయోగించి తెల్ల దోమలను ఆకర్షించి నియంత్రించవచ్చు. బంతిపూల మొక్కలను పెంచడం ద్వారా పూలు విడుదల చేసే లిమొనెన్ వాయువు తెల్లదోమను నివారిస్తుంది. ఆముదంతో పూత పూసిన టార్పాలిన్‌ను ఉపయోగించి తక్కువ ఖర్చుతో అరికట్టవచ్చు.
రసాయన పద్ధతి ద్వారా..
నర్సరీల నుంచి మొక్కలు నాటేందుకు తీసుకువచ్చేటప్పుడు ప్రతీ మొక్కను పరిశీలించాలి. చీడపీడల బెడద లేని మొక్కల్ని మాత్రమే నాటాలి. తెగులు సోకిన ప్రాంతాల నుంచి మొక్కల సేకరణ నిలిపివేయాలి. మసి అచ్చు పెరుగుదల, జిగట పదార్థం కనిపిస్తే వెంటనే నివారణ చర్యలు చేపట్టాలి.
సేంద్రియ పద్ధతుల ద్వారా..
పవర్ స్ప్రేయర్, ట్రాక్టర్ స్ప్రేయర్‌తో ఐదు గ్రాముల డిటర్జెంట్ పౌడర్‌ను లీటర్ నీటిలో కలిపి పిచికారి చేయాలి. ఎకరాకు 200 లీటర్ల నీటిని ఉపయోగించాలి. 10 మిల్లీలీటర్ల వేప నూనె లీటర్ నీటిలో కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు ఆకుల కింది భాగంపై పిచికారి చేయాలి. 15 రోజుల తర్వాత జీవ నియంత్రణ పద్ధతిలో 100 లీటర్ల నీటిలో లీటర్ శిలీంద్ర కల్చర్, నాలుగు కిలోల బెల్లం, నాలుగు కిలోల గంజి పిండిని కలిపి వారంపాటు మరగనివ్వాలి. ఈ ద్రావణాన్ని 5ఎంఎల్‌ను లీటర్ నీటికి కలిపి ఆకుల కింది భాగం పైన పిచికారి చేయించాలి.
ఆయిల్‌పామ్ సాగు వివరాలు
జిల్లాలో సాగు విస్తీర్ణం : 8,165 ఎకరాలు
సాగు చేస్తున్న రైతుల సంఖ్య : 3,304
అవగాహన కల్పిస్తున్నాం
ఆయిల్‌పామ్ సాగు చేస్తున్న రైతులకు పంటకు సోకే చీడపీడలు, నివారణపై అవగాహన కల్పిస్తున్నాం. మొక్కలకు ఇతర ప్రాంతాల్లో తెల్లదోమ సోకుతుంది. జిల్లాలో ఆయిల్‌పామ్ రైతులు అప్రమత్తంగా ఉండాలి. తెల్లదోమ సోకిన లక్షణాలు కనిపిస్తే ఉద్యానవనశాఖ అధికారులకు సమాచారం అందించాలి.
– రమణ, జిల్లా ఉద్యానవనశాఖ అధికారి

ఆయిల్‌పామ్‌కు తెల్లదోమ..!