
గ్రూప్–1 నియామకాల వివాదంపై సుప్రీంకోర్టు ధర్మాసనం
సాక్షి, న్యూఢిల్లీ: గ్రూప్–1 సర్వీసుల నియామకాల వివాదంలో తెలంగాణ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో మంగళవారం ఊరట లభించింది. ఈ అంశంపై దాఖలైన స్పెషల్ లీవ్ పిటిషన్లను సర్వోన్నత న్యాయస్థానం డిస్మిస్ చేసింది. ప్రధాన అప్పీళ్లు హైకోర్టులో ఈ నెల 15న విచారణకు రానున్నందున ఈ దశలో జోక్యం చేసుకోలేమని తెలిపింది. అయితే ఈలోగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే నియామకాలన్నీ హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఉండాలని తేల్చిచెప్పింది.
అదే సమయంలో ఆయా పోస్టుల్లో నియమితులైన వారికి ఎలాంటి సమానత్వ హక్కులు వర్తించవని స్పష్టం చేసింది. ఈ మేరకు జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జొయ్‌మాల్యా బాగ్చీలతో కూడిన ధర్మాసనం మంగళవారం విచారణ సందర్భంగా స్పష్టం చేసింది. ఈ అంశంపై వీలైనంత త్వరగా విచారణ పూర్తి చేసి తీర్పు వెలువరించాలని హైకోర్టుకు సూచించింది.
వివాద నేపథ్యం ఇదీ..
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్–1 మెయిన్స్ పరీక్షల మార్కులు, ర్యాంకింగ్ జాబితాను రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు సింగిల్ జడ్జి ఈ ఏడాది సెప్టెంబర్ 9న తీర్పు ఇచ్చారు. సమాధాన పత్రాలను సరైన మోడరేషన్‌తో తిరిగి మూల్యాంకనం చేయాలని లేదా కొత్తగా మెయిన్స్ పరీక్ష నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించారు. ఈ తీర్పును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్‌తోపాటు ఎంపికైన కొందరు అభ్యర్థులు హైకోర్టులోని డివిజన్ బెంచ్ ముందు సవాల్ చేశారు.
ఈ అప్పీళ్లను విచారించిన డివిజన్ బెంచ్.. సింగిల్ జడ్జి తీర్పుపై స్టే విధిస్తూ సెప్టెంబర్ 24న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఒకవేళ నియామకాలు చేపడితే అవి రిట్ అప్పీళ్ల తుది తీర్పునకు లోబడి ఉండాలని షరతు విధించింది. డివిజన్ బెంచ్ మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేస్తూ కొందరు అభ్యర్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు.