అలా అయితే రూ.75కే‌ లీటర్ పెట్రోల్‌!

Petrol Price Can Come Down To Rs 75 if Brought Under GST - Sakshi

ప్రస్తుతం పెరిగిపోతున్న ఇంధన ధరల కారణంగా సామాన్య ప్రజానీకం ఇబ్బందులు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే కొన్ని ఇతర రాష్ట్రాలలో పెట్రోల్ ధర రూ.100 కూడా దాటేసింది. దింతో ప్రజానీకం ధరలను తగ్గించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరుతున్నారు. అయితే, ఈ సమస్యకు పరిష్కారంగా దేశంలో చమురు ఉత్పత్తులను వస్తు, సేవల పన్ను(జీఎస్‌టీ) పరిధిలోకి తీసుకొస్తే లీటర్‌ పెట్రోల్‌ ధర రూ.75, డీజిల్ రూ.68 కు దిగొస్తుందని ఎస్‌బీఐ ఆర్థికవేత్తలు అన్నారు. రాజకీయ నాయకులు సంకల్పం తీసుకోలేకపోవడం వల్ల భారతదేశంలో చమురు ఉత్పత్తి ధరలు రికార్డు స్థాయిలో ఉన్నట్లు ఎస్‌బీఐ ఆర్థిక నిపుణులు తెలిపారు.

పెట్రోలియం ఉత్పత్తులపై విధించే అమ్మకపు పన్ను/వ్యాట్ పన్నులే వారికి ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. ప్రస్తుతం పెట్రోల్‌, డీజిల్‌పై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు.. రవాణా ఛార్జీలు, డీలర్‌ కమిషన్‌, ఎక్సైజ్‌ సుంకం, సెస్‌, వ్యాట్‌ ఇలా పలు రకాల పన్నులు, ఛార్జీలు విధిస్తున్నాయి. చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే రాష్ట్రాలకు నష్టం తప్పదు. అందువల్ల చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తీసుకురావడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సిద్ధంగా లేవు. ప్రస్తుతం పెట్రోల్, డీజిల్ పై 50 నుంచి 60 శాతం పన్నులు విధిస్తున్నాయి. ఒకవేళ వీటిని జీఎస్‌టీ పరిధిలోకి తీసుకొస్తే అత్యధికంగా 28శాతం పన్ను మాత్రమే విధించాల్సి ఉంటుంది. నిజంగా తెస్తే మాత్రం వినియోగదారులపై రూ.30 వరకు భారం తగ్గుతుంది. అప్పుడు లీటర్‌ పెట్రోల్‌ రూ.75, లీటర్‌ డీజిల్‌ రూ.68కే రానున్నట్లు ఆర్థికవేత్తలు తెలిపారు.
 
చమురు ఉత్పత్తులను జీఎస్‌టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్రాలకు రూ.లక్ష కోట్ల నష్టం వస్తుందని, ఇది దేశ జీడీపీలో కేవలం 0.4శాతమేనని వారు పేర్కొన్నారు. చమురు వినియోగం రోజు రోజుకి పెరిగిపోతున్న నేపథ్యంలో వాటిని భవిష్యత్ లోకి పూడ్చుకోవచ్చు అని తెలిపారు. అంతేగాక, అంతర్జాతీయ ధరలకు అనుగుణంగా దేశంలో ఇంధన ధరల్లో రోజువారీ మార్పులు చేయకుండా చమురు ధరలను స్థిరీకరించాలని ఆర్థికవేత్తలు సూచించారు. అంటే.. అంతర్జాతీయ ధరలు తగ్గినప్పుడు వచ్చే లాభాలను, ధరలు పెరిగినప్పుడు వచ్చే లోటుతో పూడ్చుకోవాలన్నారు. అలా చేస్తే వినియోగదారులపై ఎలాంటి భారం పడదని అభిప్రాయం వ్యక్తం చేశారు. చమురు ధర విషయంలో ఎటువంటి చర్యలు తీసుకోకపోతే దేశ ఆర్థిక వ్యవస్థ ప్రమాదంలో పడే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.

చదవండి:

గూగుల్‌లో ఇవి వెతికితే మీ పని అంతే!

ఈపీఎఫ్‌ వడ్డీరేటు యథాతథం

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top