పోలీసుల మాస్టర్‌ప్లాన్‌: మొబైల్‌ చోరీకి గురైతే పనికి రాకుండా ప్లాన్‌

Mobile Robbery Bengaluru Police Lock Technology  - Sakshi

సాక్షి, బెంగళూరు: సిలికాన్‌ సిటీలో మొబైల్‌ దొంగల హవా తీవ్రతరమైంది. అలాంటి వారికి అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు సిటీ పోలీసులు మాస్టర్‌ప్లాన్‌ రూపొందించారు. ఇకపై చోరీకి గురైన మొబైల్‌ను చోరీకి పాల్పడిన దొంగలు వినియోగించకుండా లాక్‌ చేసే సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఇలాంటి వ్యవస్థను ఢిల్లీ, ముంబై పోలీసులు అమలు చేశారు. ప్రస్తుతం బెంగళూరు నగర పోలీసులు ప్రయోగాత్మకంగా అమల్లోకి తీసుకువచ్చి వీటి సాదక బాదకాలపై అధ్యయనం చేస్తున్నారు.  

నిత్యం 30 మొబైల్స్‌ చోరీ  
సిలికాన్‌ సిటీలో నిత్యం 25 నుంచి 30 మొబైల్స్‌ చోరీకి గురవుతున్నాయి. రోడ్డుపై నిలబడి మాట్లాడుతున్నవారి నుంచి లాక్కుపోవడం, సిటీ బస్సులు, రద్దీ ప్రదేశాల్లో కొట్టేయడం, లేదా సొంతదారే పోగొట్టుకోవడం జరుగుతోంది. ఐఫోన్, చాలా ఖరీదైన ఫోన్లయితే కంపెనీ సహాయంతో ఆ మొబైల్‌ని లాక్‌ చేయవచ్చు. కానీ చాలా మొబైల్స్‌ను ఏమీ చేయడానికి సాధ్యం కాదు. కానీ ప్రస్తుతం క్రైం క్రిమినల్‌ ట్రాకింగ్‌ నెట్‌వర్క్‌ సిస్టమ్‌ (సీసీటీఎన్‌ఎస్‌) సహాయంతో మొబైల్‌ లాక్‌ చేసే విధానాన్ని పోలీస్‌శాఖ తీసుకొచ్చింది.  

మొబైల్‌ను లాక్‌ చేస్తే దొంగలు ఉపయోగించలేరు

దొంగ మొబైల్స్‌ కొనొద్దు  
చోరీకి గురైన మొబైల్స్‌ను తక్కువ ధరకు వస్తుందని ఎవరైనా కొని ఉపయోగిస్తే అది పోలీసులకు తెలిసిపోతోంది. ఆ మొబైల్‌లోని సిమ్‌ నంబరు, ఏ ఊరిలో వాడుతున్నారు అనేది పూర్తిగా పోలీసులకు చేరుతుంది. కాబట్టి చోరీ చేసిన ఫోన్లను కొనడం, ఉపయోగించడం ఎంతమాత్రం తగదని రమణ్‌గుప్తా తెలిపారు.

ఇలా ఫిర్యాదు చేయాలి  
మొబైల్‌ చోరీలు అడ్డుకట్ట వేయడానికి బెంగళూరు నగర పోలీస్‌ విభాగంలో సీఇఐఆర్‌ (సెంట్రల్‌ ఎక్విప్‌మెంట్‌ ఐడెంటిటీ రిజిస్టర్‌) యాప్‌ రూపొందించారు.  
మొబైల్‌ చోరీకి గురైన బాధితులు పీఎస్‌లో కానీ, 112 నంబరుకు లేదా నగర పోలీస్‌ వెబ్‌సైట్‌లోని ఇ– లాస్ట్‌లో కానీ ఫిర్యాదు చేయాలి. ఐఎంఈఐ నంబరును చెబితే వెంటనే మొబైల్‌ను బ్లాక్‌ చేస్తారు. ఆ మొబైల్‌ ను ఎవరూ ఉపయోగించలేరు.  
తద్వారా మొబైల్‌ విక్రయించడానికీ వీలు కాకపోవడంతో చోరీలు తగ్గుతాయని నగర జాయింట్‌ పోలీస్‌ కమిషనర్‌ రమణ్‌గుప్తా తెలిపారు.  
ఇందుకుగాను బాధితులు అదే నంబరుతో మరో సిమ్‌ తీసుకుని ఉండాలి. అప్పుడు ఆ ఫోన్‌కు ఓటీపీ రాగానే ఎంటర్‌ చేయాలి. తరువాత బ్లాక్‌ ప్రక్రియ పూర్తవుతుంది. 
ప్రస్తుతం ఈ ప్రక్రియను ప్రయోగాత్మకంగా నిర్వహిస్తున్నారు. ఇందులో ఎలాంటి భయ సందేహాలు వద్దని పోలీసులు తెలిపారు. ఫోన్‌ మళ్లీ దొరికితే పోలీసుల అనుమతి తీసుకుని యథావిధిగా ఉపయోగించవచ్చని చెప్పారు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top