ఈడీ ఎఫెక్ట్‌.. జార్ఖండ్‌ సీఎం కీలక నిర్ణయం! | Sakshi
Sakshi News home page

కొనసాగుతున్న ఈడీ సోదాలు.. జార్ఖండ్‌ సీఎం కీలక నిర్ణయం!

Published Wed, Jan 3 2024 9:31 AM

ED Searching In Ranchi And Rajasthan Mining Money Laundering Case - Sakshi

ఢిల్లీ: జార్ఖండ్‌, రాజస్థాన్‌లో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) సోదాలు మరోసారి రాజకీయంగా ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. జార్ఖండ్‌లో అక్రమ మైనింగ్‌కు సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఈడీ రెండు రాష్ట్రాల్లో దాదాపు 12 చోట్ల తనిఖీలు చేస్తోంది. 

తాజాగా జార్ఖండ్‌ ముఖ్యమంత్రి హేమంత్‌ సొరేన్‌ మీడియా అడ్వజర్‌ అభిషేక్‌ ప్రసాద్‌కు సంబంధించిన నివాసం, ఆఫీసుల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. అలాగే, హజారీబాగ్‌ డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ రాజేంద్ర దుబే, సాహిబ్‌ గంజ్‌ జిల్లా కలెక్టర్‌ రామ్‌ నివాస్‌కు సంబంధించిన కార్యాలయాల్లో తనిఖీలు జరుగుతున్నాయి. ఇక, రామ్‌ నివాస్‌కు రాజస్థాన్‌లో కూడా ఇళ్లు ఉండటం గమనార్హం. 

ఇదిలా ఉండగా.. మనీలాండరింగ్‌ కేసుతో సంబంధం ఉందని ఆరోపిస్తూ జార్ఖండ్‌ సీఎం హేమంత్‌ సొరేన్‌కు ఈడీ పలుమార్లు నోటీసులు జారీ చేసింది. తాజాగా శనివారం కూడా నోటీసులు అందించింది. వాటిని వ్యతిరేకిస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను ఇటీవల సుప్రీం కోర్టు తిరస్కరించింది. దీనిపై జార్ఖండ్‌ హైకోర్టుకు వెళ్లాలని సూచించింది. ఈ నేపథ్యంలో తాజాగా ఈడీ మరోసారి సోరెన్‌కు అవకాశమిచ్చింది. 

మరోవైపు.. 81 అసెంబ్లీ స్థానాలున్న జార్ఖండ్‌లో ఈ ఏడాది చివర్లో ఎన్నికలు జరగనున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించేందుకు జేఎంఎం నేతృత్వంలోని అధికార కూటమి బుధవారం తమ ఎమ్మెల్యేలతో సమావేశం కానుంది.

ఈడీ నోటీసుల నేపథ్యంలో జార్ఖండ్‌ రాజకీయాలకు సంబంధించి మరో వార్త సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈడీ కేసు వెంటాడుతున్న నేపథ్యంలో సీఎం పదవికి హేమంత్‌ సోరెన్ రాజీనామా చేస్తారని, ఆ బాధ్యతలను సతీమణి కల్పనకు అప్పగిస్తారని ప్రతిపక్ష నేతలు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే గండేయ్‌ స్థానం నుంచి ఆమెకు అవకాశం కల్పించేలా.. అహ్మద్‌తో రాజీనామా చేయించారని ఆరోపించింది. ఈ మేరకు బీజేపీ నేత, ఎంపీ నిషికాంత్‌ దూబే ట్విట్టర్‌లో పోస్టు చేశారు. కాగా, బీజేపీ నేతల వ్యాఖ్యలపై సీఎం సొరేన్‌ స్పందించారు. దీన్ని ఖండించిన సోరెన్‌.. తన సతీమణి పోటీ చేసే అవకాశం పూర్తిగా అబద్దమేనని కొట్టిపారేశారు. తాను ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ వస్తున్న వార్తలను నిజం కాదన్నారు.

Advertisement
Advertisement