జైల్లో సిసోడియా.. సీబీఐ మరో కేసు.. ప్రధాని ప్లానేనంటూ ట్వీట్‌!

CBI Filed Another Corruption Case Against Manish Sisodia - Sakshi

ఢిల్లీ: ఆమ్‌ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ లిక్కర్‌ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్‌ సిసోడియాకు మరో షాక్‌ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్‌ విభాగంలో(FBU) అవినీతి ఆరోపణలకుగానూ ఆయనపై తాజాగా సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌ ఏజెన్సీ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయన లిక్కర్‌ స్కాంలో అరెస్ట్ అయ్యారు.

ఫీడ్‌బ్యాక్‌ యూనిట్‌ను ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక ఆప్‌ ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసింది. అయితే ఈ విభాగం ఏర్పాటు, నిర్వాహణ అంతా చట్టానికి విరుద్ధంగా నడిచిందని, సుమారు రూ.36 లక్షల నష్టంతో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. ఈ అవినీతి ఆరోపణలకుగానూ సిసోడియాపై కేసు నమోదు చేస్తున్నట్లు సీబీఐ వెల్లడించింది.

ఈ పరిణామంపై ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ స్పందించారు. ఇదంతా ప్రధాని ప్లాన్‌ అని, సుదీర్ఘకాలం మనీష్‌ సిసోడియాను జైల్లో ఉంచేందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ట్వీట్‌ చేశారాయన. 

ఎఫ్‌బీయూను తప్పుడు దోవలో రాజకీయ అవసరాల కోసం సిసోడియా ఉపయోగించారని, ఇతరుల వ్యక్తిగత సమాచార సేకరణ యత్నం జరిగిందని(Snooping Case) సీబీఐ తన నివేదికలో పొందుపరిచింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను విచారించేందుకు సీబీఐను అనుమతించింది కూడా.

ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి అయిన సిసోడియాను సీబీఐ ఢిల్లీ ఎక్సైజ్‌ పాలసీ 2021-22 రూపకల్పనలో జరిగిన అవినీతి కుంభకోణానికిగానూ ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్‌ చేసింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top