
నేడు పీయూకు విద్యా కమిషన్ రాక
మహబూబ్‌నగర్ ఎడ్యుకేషన్: పాలమూరు యూనివర్సిటీకి గురువారం రాష్ట్ర విద్యా కమిషన్ రానుందని పీయూ రిజిస్ట్రార్ రమేష్‌బాబు పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం పీయూలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కమిషన్ ఏర్పడిన తర్వాత పాలమూరు యూనివర్సిటీలో మొట్టమొదటిసారి ‘విద్యా బలోపేతంపై అభిప్రాయ సేకరణ’ అనే అంశంపై కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం గొప్ప విషయం అన్నారు. పీయూ ఫార్మసీ కళాశాల ఆడిటోరియంలో కార్యక్రమం జరుగుతుందని, ఇందులో విద్యా కమిషన్ చైర్‌పర్సన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆకునూరి మురళి, కమిషన్ మెంబర్స్ పీఎల్ విశ్వేశ్వర్‌రావు, చారకొండ వెంకటేష్, జ్యోష్నశివారెడ్డి, పీయూ వీసీ శ్రీనివాస్ పాల్గొంటారన్నారు. ఇందుకు సంబంధించి పీయూ పూర్వ, ప్రస్తుత విద్యార్థులు, అధ్యాపకులు, నాన్‌టీచింగ్ సిబ్బంది, విద్యార్థి సంఘాల నుంచి అభిప్రాయాలు సేకరిస్తారన్నారు. ఇందులో విద్యా బలోపేతం, బోధన లోపాలు, వసతుల కల్పన తదితర అంశాలను కమిషన్‌కు తెలియజేస్తే వారు రిపోర్టు రూపంలో ప్రభుత్వానికి అందజేసే అవకాశం ఉందన్నారు. సమావేశంలో ప్రిన్సిపాళ్లు కరుణాకర్‌రెడ్డి, రవికాంత్ పాల్గొన్నారు.