
ఆహ్లాదం.. దూరం!
నారాయణపేట: పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పట్టణ ప్రకృతి వనాలను ఏర్పాటుచేసింది. ఖాళీగా ఉన్న మున్సిపల్ స్థలాల్లో చిట్టడవులను పెంచడం ద్వారా వాయు కాలుష్యం తగ్గడంతో పాటు ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందుతుందని భావించింది. ఇందుకోసం పట్టణ ప్రగతి నిధులను ప్రత్యేకంగా వెచ్చించి.. ప్రకృతివనాల్లో వేప, తంగెడు, చింత, టేకు, కానుగ, ఇతర రకాల మొక్కలను నాటించింది. అయితే మొదట్లో వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టిసారించిన అధికారులు.. కొన్నేళ్లుగా గాలికొదిలేయడంతో అధ్వానంగా మారాయి. మొక్కలు, చెట్లు పెరగాల్సిన ప్రాంతాల్లో పిచ్చి మొక్కలు దర్శనమిస్తున్నాయి.
బోర్డులకే పరిమితం..
తెలంగాణకు హరితహరం.. వార్డుకో ఉద్యానవనం పేరిట మూడేళ్ల క్రితం రూ.లక్షల వ్యయంతో ఏర్పాటుచేసిన ప్రకృతి వనాలు అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతున్నాయి. ప్రకృతి వనాల్లో నాటిన మొక్కలు ఎండిపోయాయి. పట్టణ ప్రకృతివనాలు కేవలం బోర్డులు, ఫెన్సింగ్‌లకే పరిమితమయ్యాయని చెప్పవచ్చు. కొన్ని చోట్ల అంతకుముందే మొక్కలు ఉండగా.. పట్టణ ప్రకృతివనం బోర్డు ఏర్పాటుచేసి నిధులు కాజేశారనే ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికై నా ప్రకృతి వనాలపై అధికారులు ప్రత్యేక దృష్టిసారించి, ప్రజలకు అహ్లాదం పంచే విధంగా తీర్చిదిద్దాలని కోరుతున్నారు.
క్షేత్రస్థాయిలో పరిశీలిస్తాం..
హరితహరంలో నాటిన మొక్కలు లేని చోట వనమహోత్సవంలో మొక్కలు నాటించి పెంచుతాం. మొక్కల సంరక్షణపై ప్రత్యేక చొరవ తీసుకుంటాం. పట్టణ ప్రకృతి వనాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి వినియోగంలోకి తీసుకొచ్చేందుకు కృషి చేస్తాం. – భోగేశ్వర్,
మున్సిపల్ కమిషనర్, నారాయణపేట.
నిర్లక్ష్యపు నీడలో పట్టణ ప్రకృతివనాలు
నెరవేరని ప్రభుత్వ లక్ష్యం
నిర్వహణ లోపంతో పెరగని మొక్కలు
పిచ్చి మొక్కలకు నిలయాలుగా మారిన వైనం

ఆహ్లాదం.. దూరం!

ఆహ్లాదం.. దూరం!

ఆహ్లాదం.. దూరం!