
‘స్థానిక’ ఎన్నికలకు సిద్ధం కావాలి
నారాయణపేట: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా నిర్వహించేందుకు సిద్ధంగా ఉండాలని కలెక్టర్ సిక్తాపట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం సా యంత్రం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో ఆమె అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. జిల్లాలో 13 జెడ్పీటీసీ, 136 ఎంపీటీసీ స్థానాల ఎన్నికల నిర్వహణకు దాదాపు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, పోలింగ్ కేంద్రాలు, సిబ్బంది, సమస్యాత్మక కేంద్రాలు గుర్తించినట్లు జెడ్పీ సీఈవో శైలేష్ కుమార్ వివరించారు. గతంలో 140 ఎంపీటీసీ స్థానాలుండగా మద్దూరు పురపాలిక కావడంతో 136కు తగ్గా యని చెప్పారు. అలాగే గతేడాది సర్పంచి ఎన్నికల్లో జిల్లాలో మొత్తం 280 గ్రామపంచాయతీలు ఉండగా.. ప్రస్తుతం మద్దూరు మున్సిపాలిటీ కావడంతో వాటి సంఖ్య 272కు తగ్గిందని డీఎల్పీఓ సుధాకర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల ట్రైనర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల నిబంధనలు, నామినేషన్ల ప్రక్రియ, పరిశీలన, ఉపసంహరణ తదితర అంశాలను క్లుప్తంగా వివరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఎన్నికల ప్రకటన ఎప్పుడు వెలువడినా నిర్వహణకు ఇప్పటి నుంచే అన్నీ సిద్ధం చేసుకుని ఉండాలని సూచించారు. జిల్లాకేంద్రం సమీపంలోని శ్రీ దత్త బృందావన్ కళాశాలలో ఎన్నికల సామగ్రి పంపిణీ, రిసెప్షన్ సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, డీఆర్డీఓ మొగులప్ప, అన్ని మండలాల ఎంపీడీఓలు, ఎంపీఓలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులపై ప్రణాళికతో ముందుకు..
మద్దూరు మండలంతో పాటు మున్సిపాలిటీలో అవసరమైన అభివృద్ధి పనులకు అధికారులు తగిన ప్రణాళికతో ముందుకు సాగాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వీసీ హాల్‌లో అధికారులతో సమీక్ష నిర్వహించారు. డ్రెయినేజీ, తాగునీటి సరఫరా పథకాలకు రూ.19 కోట్లు, అండర్‌గ్రౌండ్ డ్రెయినేజీ, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ డంపింగ్ యార్డ్‌కు రూ.6.41 కోట్లు, రహదారులకు రూ.35 కోట్లు, ఫేస్–1, ఫేస్–2 రూ.45 కోట్లు, వైకుంఠధామానికి రూ.3.65 కోట్లు, ఇండోర్ స్టేడియానికి రూ.7.67 కోట్లు, కమర్షియల్ కాంప్లెక్స్, ఆడిటోరియం, మినీ స్టేడియం, పార్క్, కమ్యూనిటీ హాల్ షాదీఖానా తదితర వాటికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. మద్దూర్ మున్సిపాలిటీలో మొత్తం రూ.340.07 కోట్ల ప్రతిపాదనలు పంపుతున్నట్లు తెలిపారు. సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వార్, కాడా ప్రత్యేక అధికారి వెంకట్‌రెడ్డి, ఈఈ విజయభాస్కర్‌రెడ్డి, డీఈ మల్లేష్, పుర కమిషనర్ శ్రీకాంత్, ఏఈ మహేష్, ఎన్‌సీపీఈ కన్సల్టెన్సీ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టరేట్‌లో దొడ్డి కొమురయ్య వర్ధంతి..
కలెక్టరేట్‌లో శుక్రవారం దొడ్డి కొమురయ్య వర్ధంతిని జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. కలెక్టర్ సిక్తా పట్నాయక్ కొమురయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తెలంగాణ సాయుధ పోరాట తొలి అమరుడు దొడ్డి కొమురయ్య అని, భూమి, భుక్తి, విముక్తి కోసం పోరాటం చేసిన మహానీయుడని కొనియాడారు. కార్యక్రమంలో కలెక్టరేట్ ఏఓ జయసుధ, బీసీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ ఖలీల్, సాంఘిక సంక్షేమశాఖ అధికారి ఉమాపతి, డీపీఆర్వో రషీద్, జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, కలెక్టరేట్ అధికారులు, ఉద్యోగులు, బీసీ సంక్షేమశాఖ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ సిక్తా పట్నాయక్