
సమస్యలన్నీ పరిష్కరిస్తాం
వివరాలు 8లో u
నారాయణపేట: పురపాలికలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని నారాయణపేట పుర కమిషనర్ భోగేశ్వర్ తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం 12 నుంచి ఒంటి గంట వరకు ‘సాక్షి’ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫోన్–ఇన్‌కు పుర ప్రజల నుంచి విశేష స్పందన లభించింది. వార్డుల్లో నెలకొన్న తాగునీటి ఎద్దడి, డ్రెయినేజీల్లో మురుగు, చెత్త తొలగింపు, వీధిదీపాలు, పందులు, దోమల నియంత్రణ, శిథిల భవనాలతో ఇబ్బందులు, కొండారెడ్డిపల్లి చెరువు నుంచి వచ్చే నాలా తదితర వాటిపై ప్రజలు అడిగిన ప్రశ్నలకు ఓపికగా సమాధానాలిచ్చారు. ఆయా విభాగాలుగా అడిగిన సమస్యలను పుర ఇంజినీర్ మహేశ్, శానిటేషన్ ఇన్‌చార్జ్ శ్రీనివాస్‌జీ, టీపీబీఓ రాజేశ్ రాసుకున్నారు. సమ స్యలు త్వరగా పరిష్కరించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
● సమస్య: పట్టణంలోని 16వ వార్డు పత్తిబజార్‌లో ఓ ఇల్లు పాడుబడింది. విషపు పురుగుల సంచారం పెరిగింది. వీధి దీపాలు వెలగడం లేదు.
– నారాయణ, పత్తిబజార్
● కమిషనర్: శిథిల ఇంటి యజమానికి నోటీసులు జారీ చేస్తాం. ఆయన తొలగించకపోతే పురపాలిక నుంచి తొలగించేందుకు చర్యలు తీసుకుంటాం. కాలనీలో త్వరలోనే వీధిదీపాలు ఏర్పాటు చేస్తాం.
● సమస్య: బాబాకాలనీలో డ్రెయినేజీలు నిర్మించాలి. మిషన్ భగీరథ పైపులైన్ ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ రోడ్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన పార్క్‌కు సీసీ రోడ్డు వేయండి.
– కాశీనాథ్, బాబాకాలనీ
● కమిషనర్: అమృత్ 2.0 పథకం కింద మూడు భారీ నీటిట్యాంకులు, పైప్‌లైన్ ఏర్పాటు చేస్తున్నాం. డ్రెయినేజీలు, పార్క్‌కు సీసీ రహదారి నిర్మాణానికి చర్యలు తీసుకుంటాం.
● సమస్య: 13వ వార్డులో గుట్టమీద 300 మీటర్ల వరకు పైపులైన్ టెండర్లు పూర్తయినా పనులు కావడం లేదు. చెత్తబండి ఇంటి ఎదుట రెండు నిమిషాలు కూడా నిలపడం లేదు. తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది.
– పోలెమోని శ్రీకాంత్, 13వ వార్డు
● కమిషనర్: పుర ఇంజినీర్ దృష్టికి తీసుకెళ్లి పైప్‌లైన్ పనులు త్వరగా పూర్తి చేయిస్తాం. చెత్త బండి ఇంటింటి ఎదుట 2 నిమిషాలకంటే ఎక్కువ సమయం నిలపాలని డ్రైవర్లకు సూచిస్తాం. తాగునీటి ఎద్దడి నివారణకు చర్యలు చేపడతాం.
● సమస్య: 21వ వార్డులో స్పీడ్ బ్రేకర్లు వేయాలి. డ్రెయినేజీలు వారానికి ఒకసారైన శుభ్రం చేయించాలి.
– రవికిరణ్, వార్డు వాసి
● కమిషనర్:అవసరమైన చోట స్పీడ్ బ్రేకర్లు వేయిస్తాం. డ్రెయినేజీల్లో మురుగు తొలగింపజేస్తాం
● సమస్య: బాహర్‌పేటలో డ్రెయినేజీలపై స్లాబ్ వేయకపోవడంతో చెత్త బండి సైతం రావడం లేదు. దోమల బెడద పెరగడంతో పాటు పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
– అంజయ్య, 12వ వార్డు వాసి
● కమిషనర్:డ్రెయినేజీలపై అవసరం ఉన్న చోట స్లాబ్ వేయిస్తాం. మురుగు తొలగిస్తాం. దోమలు, పందుల నియంత్రణకు చర్యలు తీసుకుంటాం.
● సమస్య: జామా మసీద్ సమీపం, గుడ్‌లక్ దుకాణం దగ్గర చెత్తకుండీలు తొలగించండి. చెత్త సేకరణపై ప్రజలకు అవగాహన కల్పించాలి.
– యూసుఫ్ తాజ్, వార్డు వాసి
● కమిషనర్:చెత్త కుండీలను తొలగిస్తాం. చెత్త సేకరణ వాహనాల్లో తడి, పొడి చెత్తను వేర్వేరుగా వేసేందుకు ప్రజలకు అవగాహన కల్పిస్తాం.
సమస్య: 8వ వార్డులోని ఎల్లమ్మ ఆలయం వద్ద బోరు మరమ్మతు చేపట్టాలి. వాటర్ లైన్‌మెన్‌ను మార్చాలి.
– లక్ష్మణ్, 8వ వార్డు
కమిషనర్:బోరు మరమ్మతు వెంటనే పూర్తి చేయిస్తాం. వాటర్ లైన్‌మెన్ సమస్యను పరిష్కరిస్తాం.
సమస్య: 20వ వార్డులో పారిశుద్ధ్య చర్యలు సక్రమంగా నిర్వహించడం లేదు. జవాన్లు ముందుండి పనులు చేయించడం లేదు. డ్రెయినేజీలు ఎప్పుడు శుభ్రం చేస్తారో తెలియడం లేదు.
– మహ్మద్ హుస్సేనీ, వార్డువాసి
కమిషనర్:పారిశుద్ధ్య పనులు పట్టణమంతా కొనసాగుతున్నాయి. నెలలో రెండు, మూడుసార్లు విధిగా డ్రెయినేజీల్లో పూడిక తొలగిస్తున్నాం. జవాన్లు పారిశుద్ధ్య సిబ్బంది వెంట ఉండి పనులు చేయించేలా చర్యలు తీసుకుంటాం.
సమస్య: కొండారెడ్డిపల్లి చెరువు నుంచి పళ్ల వంతెన, వల్లంపల్లి వంతెన వరకు పారే సాగునీటి కాల్వలో పెరిగిన ముళ్ల పొదలు, పూడిక తొలగించాలి. వర్షాకాలంలో పళ్ల ప్రాంతంలోని కాలనీల్లోకి నీరు చేరుతోంది. పంట పొలాల్లోకి మురుగు పారుతోంది.
– వెంకోభా, బీకేఎస్ నాయకుడు
కమిషనర్: కొండారెడ్డిపల్లి చెరువు నుంచి వచ్చే నాలాలో పూడికతీత, ముళ్లపొదల తొలగింపునకు చర్యలు చేపడుతున్నాం. త్వరలోనే సమస్య పరిష్కారమవుతుంది.
సమస్య: గాంధీనగర్ శాసన్‌పల్లి రోడ్‌లో స్పీడ్ బ్రేకర్ దగ్గర వీధిలైట్ కాలిపోయి రెండు నెలలు అవుతోంది. మే 21న ఫోన్ చేస్తే కోటా లేదన్నారు. ఎప్పుడు వేస్తారో చెప్పండి.
– శ్రీకాంత్, కాలనీవాసి
కమిషనర్: పట్టణంలో ఎక్కడెక్కడ వీధి దీపాలు కాలిపోయాయో కొత్తవి వేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు సిద్ధం చేశాం. త్వరలోనే బిగిస్తారు.
సమస్య: ఇందిరమ్మ ఇంటి నిర్మాణదారులకు కొళాయి కనెక్షన్లు ఇవ్వాలి. ఓపెన్ ప్లాట్లలో ముళ్లపొదలు పెరిగి, మురుగు నిలిచి దోమల బెడద అధికమైంది. – అనిల్, 10వ వార్డు వాసి
కమిషనర్:ఇందిరమ్మ ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాతే కొళాయి కనెక్షన్ ఇస్తాం. ఓపెన్ ప్లాట్లను శుభ్రం చేయించుకోవాలంటూ యాజమానులకు నోటీసులు జారీ చేస్తాం.