
ఏఐ ఆధారిత విద్యతో సామర్థ్యాలు మెరుగు
కోస్గి రూరల్: విద్యార్థుల్లో దాగి ఉన్న నైపుణ్యాలను వెలికితీసేందుకు ఏఐ ఆధారిత విద్య దోహదపడుతుందని డీఎంఓ రాజేంద్రకుమార్ అన్నారు. బుధవారం కోస్గి పట్టణంలోని ఉర్దూ మీడియం ఉన్నత పాఠశాలలో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా డీఎంఓ మాట్లాడుతూ.. విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరై కృత్రిమ మేధ సహకారంతో సామర్థ్యాలను మెరుగుపర్చుకోవాలని సూచించారు. చదువులో వెనకబడిన విద్యార్థులపై ఉపాధ్యాయులు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. కార్యక్రమంలో ఎంఈఓ శంకర్‌నాయక్, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం రామకృష్ణారెడ్డి, హెచ్‌ఎం ఖుత్‌బుద్దీన్, మేకల రాజేశ్ పాల్గొన్నారు.
ఆరోగ్య సూత్రాలు
పాటించాలి
నారాయణపేట రూరల్: వ్యాధుల బారిన పడకుండా ప్రతి ఒక్కరూ ఆరోగ్య సూత్రాలు పాటించాలని డీఎంహెచ్‌ఓ జయచంద్రమోహన్ అన్నారు. మండలంలోని పేరపళ్ల ఆరోగ్య ఉపకేంద్రంలో బుధవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన పలు రికార్డులను పరిశీలించడంతో పాటు ప్రజలకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. అనంతరం గర్భిణులు, కిశోర బాలికలనుద్దేశించి డీఎంహెచ్‌ఓ మాట్లాడారు. ఆరోగ్య సంరక్షణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడంతో పాటు పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు. డీఎంహెచ్‌ఓ వెంట ఎన్‌సీడీ జిల్లా కోఆర్డినేటర్ విజయకుమార్, ఎంఎల్‌హెచ్‌పీ శిరీష, ఆరోగ్య కార్యకర్త సుజాత పాల్గొన్నారు.
స్వరాష్ట్రంలోనూ
పాలమూరుకు అన్యాయం
పాలమూరు: ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా సాగునీటి సమస్యలపై పాలమూరు అధ్యయన వేదిక ఆధ్వర్యంలో శనివారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సదస్సు నిర్వహిస్తున్నట్లు ఉమ్మడి జిల్లా కన్వీనర్ రాఘవాచారి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. మూడు సెషన్లలో సదస్సు ఉంటుందని, మొదటి సెషన్‌లో ప్రొఫెసర్ హరగోపాల్ ప్రారంభ ఉపన్యాసం చేస్తారన్నారు. మూడు సెషన్లలో ఎంతో మంది వక్తలు సమస్యలపై ఉపన్యాసాలు ఇస్తారన్నారు. ఉమ్మడి జిల్లా నుంచి మేధావులు, ప్రజా సంఘాల నాయకులు అధిక సంఖ్యలో తరలిరావాలన్నారు. తెలంగాణ ఏర్పాటు జరిగిన ఇంకా జల వనరుల దోపిడీ ఆగలేదని, స్వరాష్ట్రంలో కూడా జిల్లా వివక్షకు గురవుతుందన్నారు. సాగునీటి కల్పనలో జిల్లాకు అన్యాయం జరిగిందని, కృష్ణానది నీటిలో న్యాయమైన వాటా ఇవ్వలేదని ఆరోపించారు.
జోరుగా ఉల్లి వ్యాపారం
దేవరకద్ర: పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం ఉల్లి వ్యాపారం జోరుగా సాగింది. వేలంలో నాణ్యతగా ఉన్న ఉల్లి ధర గరిష్టంగా రూ.2 వేలు, కనిష్ట ధర రూ.1,100 వరకు పలికింది. చిన్నసైజు ఉల్లి గరిష్టంగా రూ.700, కనిష్టంగా రూ.300 వరకు ధరలు వచ్చాయి. అలాగే 50 కిలోల బస్తా గరిష్ట ధర రూ.వెయ్యి, కనిష్ట ధర రూ.550, చిన్న సైజు ఉల్లి గరిష్ట ధర రూ.350, కనిష్టంగా రూ.150 బస్తాగా విక్రయించారు. మార్కెట్‌కు దాదా పు వెయ్యి బస్తాల ఉల్లి అమ్మకానికి వచ్చింది. ఎక్కువగా చిరు వ్యాపారులు, వినియోగదారులు ఉల్లిని కొనుగోలు చేశారు.
మొక్కజొన్న క్వింటాల్ రూ.2,277
జడ్చర్ల: బాదేపల్లి వ్యవసాయ మార్కెట్ యార్డులో బుధవారం మొక్కజొన్న క్వింటాల్ గరిష్టంగా రూ.2,277, కనిష్టంగా రూ.2,100 ధరలు వచ్చాయి. అలాగే ఆముదాలకు గరిష్టంగా రూ.5,970, కనిష్టంగా రూ.5,780, వేరుశనగ సరాసరిగా రూ.6,131, ధాన్యం హంస రకం రూ.1,701, ఆర్‌ఎన్‌ఆర్ గరిష్టంగా రూ.2,129, కనిష్టంగా రూ.1,952 ధరలు లభించాయి.

ఏఐ ఆధారిత విద్యతో సామర్థ్యాలు మెరుగు

ఏఐ ఆధారిత విద్యతో సామర్థ్యాలు మెరుగు