
విపత్తులు ఎదుర్కొనేలా ముందస్తు చర్యలు
నారాయణపేట: జిల్లాలో ప్రకృతి విపత్తులు సంభవించినపుడు వాటిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు అన్ని శాఖలు సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. ఈమేరకు మంగళవారం అన్ని మండలాల తహసీల్దార్లతో వరదల ప్రవాహం, భూ భారతి పెండింగ్ దరఖాస్తులు, నారాయణపేట కొడంగల్ ఎత్తిపోతల పథకం భూసేకరణ, కొత్త రేషన్ కార్డుల జారీ పై సమీక్ష జరిపారు. ప్రస్తుతం సీజన్‌లో వరదల ప్రవాహ సమాచారంపై అధికారులు అప్రమత్తంగా ఉండి ఎప్పటికప్పుడు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టాలని ఆదేశించారు. వరద నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో ముందస్తుగా చేపట్టాల్సిన చర్యలపై మక్తల్, మాగనూరు, కృష్ణా మండలాల తహసీల్దార్లకు తగు సలహాలు, సూచనలు ఇచ్చారు. జిల్లాలోని నదుల ప్రవాహం మొదటి దశ ఎంత, ప్రమాద స్థాయి ఎంత అనే పూర్తి వివరాలను ఆయా మండలాల తహపీల్దార్లను అడిగి తెలుసుకున్నారు. భూ భారతి పెండింగ్ దరఖాస్తులను వీలైనంత త్వరగా పరిష్కరించాలన్నారు. నారాయణపేట – కొడంగల్ ఎత్తిపోతల పథకం మూడో దశ భూ సేకరణ పనులు ఎంత వరకు వచ్చాయని, ఇంకా ఎన్ని ఎకరాల భూ సేకరణ చేపట్టాల్సి ఉందని అడిగారు. అధికారులు సమన్వయంతో భూ సేకరణను పూర్తి చేయాలన్నారు. కొత్త రేషన్ కార్డుల కోసం వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి అర్హులందరికీ కార్డులు వచ్చేలా చూడాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ సంచిత్ గంగ్వర్, ట్రైనీ కలెక్టర్ ప్రణయ్ కుమార్, ఆర్డీవో రామచందర్ నాయక్, అన్ని మండలాల తహసీల్దార్లు పాల్గొన్నారు.
బాలసదనం సందర్శన
జిల్లా కేంద్రంలోని బాల సదనాన్ని మంగళవారం సాయంత్రం కలెక్టర్ సిక్తా పట్నాయక్ సందర్శించారు. సదనంలో ఎంత మంది చిన్నారులు ఉన్నారని ఆరా తీయడంతోపాటు చిన్నారుల స్టడీ అవర్, వారి బోధనా పటిమను పరిశీలించారు. ఓ చిన్నారి వేసిన యోగాసనాల చూసి అభినందించారు. అందరూ బాగా చదువుకుని భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని సూచించారు. అలాగే సదనం లోని వంట గదిని పరిశీలించిన మెనూ ప్రకారం భోజనాన్ని అందించాలని సిబ్బందికి సూచించారు. చిన్నారుల సంరక్షణ లో నిర్లక్ష్యంగా వ్యవహరించ వద్దన్నారు.