
మక్తల్ మండలంలో సభ్యులకు వలపై అవగాహన కల్పిస్తున్న మత్స్యశాఖ అధికారులు
మద్దూరు: మత్స్యకారులకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేస్తోంది. ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ చేపట్టింది. సంఘాలు ఏర్పాటు చేసుకున్న మత్స్యకారులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టే సంక్షేమ పథకాలు పొందడానికి అర్హులవుతారు. ప్రభుత్వ సంక్షేమ ఫలాలు అందాలంటే మత్స్యకార సహకార సంఘాల్లో తప్పనిసరిగా సభ్యునిగా ఉండాల్సిందే. దీంతో జిల్లాలో కుంటలు, చెరువులు ఉండి సంఘాలు లేని గ్రామాల్లో కొత్త సంఘాలను ఏర్పాటు చేసి బెస్త, ముదిరాజ్ కులస్తులకు సభ్యత్వం ఇస్తున్నారు. జిల్లాలో ఇప్పటివరకు కొత్తగా 20 సంఘాలు ఏర్పాటు చేశారు.
25 కొత్త సంఘాల ఏర్పాటు లక్ష్యం..
జిల్లాలో వందలాది చెరువులు, కుంటలు ఉన్నాయి. గతంలో నీటి వసతి లేని కారణంగా చాలా గ్రామాల్లో మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవడానికి మత్స్యకారులు ముందుకు రాలేదు. ఇప్పుడు చెరువులు, కుంటలు అన్నీ నిండుతుండడంతో మత్స్యశాఖ అధికారులచే స్పెషల్ డ్రైవ్ నిర్వహించి అర్హులైన మత్స్యకారులను గుర్తించి వారిచే సంఘం ఏర్పాటు కోసం రిజిస్ట్రేషన్ చేయిస్తున్నారు. జనవరి నుంచి ఏప్రిల్ 6 వరకు 25 కొత్త మత్స్య సంఘాలను ఏర్పాటు చేయాలని ప్రభుత్వం టార్గెట్ కూడా పెట్టింది. దాంతో సంబంధిత అధికారులు చెరువు, కుంటలు ఉన్న గ్రామాల్లోని మత్స్యకారులను గుర్తిస్తున్నారు. వారితో మాట్లాడి కొత్త మత్స్య సహకార సంఘం ఏర్పాటు చేసుకోవడం ద్వారా కలిగే లాభాలపై అవగాహన కల్పిస్తున్నారు. ఇప్పటివరకు అధికారులు 20 కొత్త మత్స్య సహకార సంఘాలను ఏర్పాటు చేశారు. అందులో 180 మంది సభ్యులు ఉన్నారు.
నిబంధనల మేరకు సభ్యత్వం..
కొత్తగా మత్స్య సహకార సంఘాలు ఏర్పాటు చేసుకోవాలంటే ప్రభుత్వం కొన్ని నిబంధనలు పెట్టింది. ఆయకట్టు ప్రాంతంలో అయితే చెరువు, కుంట విస్తీర్ణం 11 ఎకరాలు ఉండాలి. అదే నాన్‌ఆయకట్టు అయితే 22 ఎకరాలు ఉండాలి. సంఘాల్లో సభ్యుడిగా చేరాలంటే 18 సంవత్సరాలు నిండాలి. కుటుంబం నుంచి ఒక్కరికి మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రతి సంఘంలో కనీసం 11మంది సభ్యులైనా ఉండాలి. ఆ పైన ఎంత మంది ఉన్నా.. సంఘంలో సభ్యత్వం కల్పిస్తారు. 11మంది సభ్యుల కన్నా తక్కువగా ఉంటే కొత్త సంఘం ఏర్పాటు చేసుకోవడానికి అవకాశం లేదు. గ్రామానికి చెందిన 11 నుంచి ఆపైన ఉన్న మత్స్యకారులు సంఘం ఏర్పాటు చేసుకుంటే అధికారులు వివిధ పరీక్షలు నిర్వహించి సంఘం రిజిస్ట్రేషన్ చేయిస్తారు.
మక్తల్ మండలంలోని కాచువార్‌కుంటలో పరీక్షలు నిర్వహిస్తున్న మత్స్యశాఖ అధికారులు
జిల్లాలో ఇలా..
జిల్లాలో మత్స్య శాఖ అధికారులు గుర్తించి 633 చెరువులు, కుంటలకు కలిపి 111 సంఘాలు ఉన్నాయి. అందులో 9,650 మంది సభ్యులుగా ఉన్నారు. 102 మత్స్య సహకార సంఘాల్లో 8,800 పురుషులు సభ్యులుగా, 09 మహిళ మత్స్య సహకార సంఘాల్లో 850 మంది మహిళలు సభ్యులుగా ఉన్నారు. స్పెషల్ డ్రైవ్‌లో ఇప్పటి వరకు 20 కొత్త సంఘాల్లో 180 మంది సభ్యులను చేర్పినట్లు అఽధికారులు తెలిపారు.