
నా వయసు 66 ఏళ్లు. ఏ పని చేతకావడం లేదు. టీడీపీ హయాంలో వృద్ధాప్య పింఛన్ కోసం ఆఫీసుల చుట్టూ తిరిగినా ఎవరూ పట్టించుకోలేదు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వలంటీర్ ఇంటికి వచ్చి వృద్ధాప్య పింఛన్ మంజూరు చేయించారు. ప్రతి నెలా ఒకటో తారీఖు పింఛన్ అందుతోంది. ఏ పని చేతకాని నాకు పింఛన్ ఆసరాగా నిలుస్తోంది. ఏటా రైతు భరోసా కింద రూ.13,500 ఇస్తున్నారు. నా భార్య ఎ.శంకుతలమ్మకు వైఎస్‌ఆర్ చేయూత, వైఎస్‌ఆర్ ఆసరా కింద డబ్బు ఇస్తున్నారు. నా పెద్ద కుమారుడు వెంకటకృష్ణ దివ్యాంగుడు. అతడికి వికలాంగుల పింఛన్ వస్తోంది. చిన్న కుమారుడు విజయకృష్ణ ఇంటర్ చదవడానికి అమ్మఒడి డబ్బులిచారు. ఇప్పుడు బీ.టెక్ చేస్తున్నాడు. ఇలా మా ఇంట్లో ప్రతి ఒక్కరికీ ఏదో రూపంలో సీఎం వైఎస్ జగన్ సాయం చేశారు. ప్రభుత్వ పథకాల వల్లే మేం ఆనందంగా జీవిస్తున్నాం. – నాగానంది వెంకటేశ్వర్లు,
బోయరేవుల గ్రామం, వెలుగోడు మండలం
జగనన్నతో వ్యవసాయం పండుగ
కుందూనది పరివాహక ప్రాంతంలో నాకు ఐదు ఎకరాల మాగాణి ఉంది. ఏటా నేను వరి సాగు చేస్తున్నాను. గతంలో పంటలు సరిగ్గా రాక మోటార్లకు విద్యుత్ బిల్లులు చెల్లించలేక వ్యవసాయమే వద్దనుకున్నాం. చాలా సార్లు అధికారులు మీటర్లను కూడా తీసుకెళ్లిన ఘటనలు ఉన్నాయి. 2004లో రైతు పక్షపాతి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం వచ్చాక ఉచిత విద్యుత్ ఇచ్చి ఆదుకున్నారు. అయినా అప్పుడు పగలు, రాత్రి రెండు విడతల్లో విద్యుత్ సరఫరా కావడంతో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా మోటార్లను ఆన్ చేసుకుని పంటలను పండించుకునే వాళ్లం. ప్రస్తుతం జగనన్న వచ్చకా పగలే 9 గంటల విద్యుత్ ఇస్తుండటంతో ఎంతో ఆనందంగా పంటలను సాగు చేసుకుంటున్నాం. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు విద్యుత్ సరఫరా చేస్తుండంతో ఎలాంటి విష పురుగులు, విద్యుత్ షాక్‌కు గురికాకుండా మోటార్ల ద్వారా వరిని సాగుచేసుకుంటున్నాం. మాకు రైతుభరోసా, ఉచిత పంటల బీమా, సున్నావడ్డీ రుణాలను కూడా పొందుతున్నాను. ప్రభుత్వం అందించే ఉచిత విద్యుత్ పుణ్యమా అని ఈరోజు రైతులంతా నాలుగు మెతుకులు తింటున్నాం. – ఉసేనయ్య, రైతు క్రిష్టిపాడు,
దొర్నిపాడు మండలం

