
విద్యుత్ భవన్
డివిజన్ల వారీగా...
డివిజన్ పేరు జీతాల్లో కోత కోత
ఉద్యోగుల సొమ్ము
ఆదోని 208 రూ.50,100
డోన్ 5 రూ.1,600
కర్నూలు టౌన్ 150 రూ.31,150
కర్నూలు రూరల్స్ 37 రూ.8,850
నంద్యాల 82 రూ.45,400
మొత్తం 482 రూ.1,37,100
● విద్యుత్ సమస్యల పరిష్కారంలో
జాప్యం చేస్తే చర్యలు
● ఉమ్మడి జిల్లాలో
482 ఫిర్యాదులు గుర్తింపు
● నిర్లక్ష్యం వహించిన ఉద్యోగులకు
మెమోలు
● జీతాల్లో నుంచి రూ.1.37 లక్షల కోత
కర్నూలు(రాజ్‌విహార్): ఏదైనా సమస్య చెబితే విద్యుత్ శాఖ సిబ్బంది త్వరగా పరిష్కరించారు. ఫిర్యాదులను పట్టించుకోరు. ఇది వినియోగదారుల మాట. ఇక నుంచి ఇలాంటి సంఘటనలు పునరావృతమైతే సదరు సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోనుంది ఆశాఖ. సేవల్లో లోపానికి మెమో జారీ చేయడంతో పాటు వేతనాల్లో కోత విధించనుంది. ఇప్పటికే ఆ దిశగా కర్నూలు ఆపరేషన్స్ ఎస్‌ఈ ఉమాపతి చర్యలకు శ్రీకారం చుట్టారు. విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఉద్యోగుల జీతాల్లో నుంచి కోతలు విధించి ఆ సొమ్మును సేవా లోపం కింద వినియోగదారుల ఖాతాలోకి జమా చేశారు. ఫలితంగా లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లతో పాటు ఏఈల్లోనూ కదలిక వచ్చింది.
482 మంది జీతాల్లోంచి
రూ.1.37 లక్షల కోత
సేవల పట్ల నిర్లక్ష్యం వహించిన సిబ్బంది తగిన మూల్యం చెల్లించుకున్నారు. ఫ్యూజ్ ఆఫ్ కాల్స్, మరమ్మతులు, విద్యుత్ కనెక్షన్ల మంజూరు, వర్క్ ఆర్డర్ల ఎస్టిమేట్ల (అంచనాలు) జారీ వంటి వాటి పట్ల సకాలంలో స్పందించకుండా జాప్యం చేసిన 482 మంది జీతాల్లో నుంచి రూ.1.37 లక్షలు రికవరీ చేశారు. ఇందులో ఏఈలు, లైన్‌మెన్లు, లైన్ ఇన్‌స్పెక్టర్లు, అసిస్టెంట్ లైన్‌మెన్లు తదితర ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ సిబ్బంది ఉన్నారు. కొన్నేళ్లుగా ఈ నిబంధన ఉన్నా.. అమలుకు నోచుకోలేదు. దీనిని తొలి సారి ఆచరణలో పెట్టడం విశేషం.
బాధ్యత తెలియజేసేందుకే
వినియోగదారులు చెల్లించిన డబ్బుతోనే మనం నెలనెలా జీతాలు తీసుకుంటున్నాం. అలాంటప్పుడు సేవలు చేయాల్సిన బాధ్యత మన పైనే ఉంది. ఈ విషయం గత ఆరు నెలలుగా చెబుతున్నా కొందరి తీరులో మార్పు లేదు. అందుకే జీతాల్లో కోతలు విధించాం. ఇది ఉద్యోగులను భయపెట్టేందుకు కాదు.. వారి బాధ్యతను గుర్తు చేయాలన్న ఉద్దేశంతో ఇలా చేస్తున్నాం. ప్రతి ఒక్కరూ బాధ్యతగా పనిచేసి వినియోగదారులకు సేవలపై భరోసా కల్పించాల్సిన అవసరం ఉంది.
– ఎం. ఉమాపతి, ఆపరేషన్స్ ఎస్‌ఈ, కర్నూలు.
