
నేటి నుంచి ఆటోమేటిక్ ఫిట్‌నెస్ పరీక్షలు
కర్నూలు: రవాణా శాఖ పరిధిలో సామర్థ్య పరీక్షలు (ఫిట్‌నెస్ టెస్ట్) సులభతరం కానున్నాయి. జిల్లాలో భారీ వాహనాలు, రవాణా వాహనాలకు ఆటోమేటిక్ ఫిట్‌నెస్ టెస్ట్(ఏటీఎస్) స్టేషన్ వసుధ ఇండస్ట్రీస్ ఏజెన్సీ దక్కించుకుంది. కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద ఏర్పాటు చేశారు. జిల్లా పరిధిలో సుమారు లక్షకు పైగా రవాణా వాహనాలు ఉన్నాయి. ఇప్పటివరకు వాటికి మోటర్ వెహికల్ ఇన్‌స్పెక్టర్లు (ఎంవీఐ) ప్రత్యక్షంగా తనిఖీ చేసి ధృవపత్రాలను జారీ చేస్తున్నారు. ఇకపై ఆ విధానానికి స్వస్తి పలికి ఏటీఎస్ ద్వారా వాహన సామర్థ్య పరీక్షలు పూర్తిస్థాయిలో నిర్వహించి ధృవపత్రాలు జారీ చేయనున్నారు. ఇప్పటివరకు కర్నూలు ఉప రవాణా శాఖ కార్యాలయం, ఆదోని ప్రాంతీయ కార్యాలయంలో ప్రభుత్వ, ప్రైవేటు వాహనాలకు ఫిట్‌నెస్ సర్టిఫికెట్లు స్వయంగా ఎంవీఐలే జారీ చేశారు. ప్రభుత్వ తాజా ఉత్తర్వుల మేరకు నేటి నుంచి (16వ తేదీ) ఫిట్‌నెస్ సేవలు రవాణా శాఖ కార్యాలయాల్లో నిలిపివేశారు. నంద్యాల జిల్లాలో చాబోలు వద్ద ఈనెల మొదటి వారంలోనే ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్‌ను ప్రారంభించగా.. కర్నూలు జిల్లాలో చిన్నటేకూరు వద్ద శుక్రవారం నుంచి ఏటీఎస్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏటీఎస్ ద్వారా 54 రకాల పరీక్షలు చేస్తారు. ఇదిలాఉంటే ఉమ్మడి జిల్లాలో కేవలం రెండు కేంద్రాలే ఏర్పాటు చేయడం, మిగిలిన ప్రాంతాల వాసులు అక్కడికి వెళ్లాలంటే అవస్థలు తప్పేలా లేవు. ఆదోనికి చెందిన వాహనదారులు చిన్నటేకూరు వద్దకు, డోన్‌కు చెందిన వాహనదారులు చాబోలు కేంద్రానికి వెళ్లాలంటే సుమారు 60 నుంచి 80 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉండటం గమనార్హం. ఇదే సమయంలో ముందస్తు సమాచారం లేకుండా రవాణా శాఖ కార్యాలయాల్లో ఫిట్‌నెస్ సేవలు నిలిపివేయడంతో రెండు రోజుల ముందే ఆన్‌లైన్‌లో స్లాట్ పొందిన గూడ్స్ వాహన యజమానులు అయోమయంలో పడ్డారు.
కల్లూరు మండలం చిన్నటేకూరు వద్ద
ప్రయివేట్ స్టేషన్
రవాణా శాఖ కార్యాలయాల్లో
ఎఫ్‌సీ సేవలు నిలుపుదల