ఎన్నికలకు ప్రజలు సహకరించాలి
చిట్యాల : పంచాయతీ ఎన్నికల సమయంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నామని, అందుకు ప్రజలకు సహకరించాలని ఎస్పీ శరత్ చంద్రపవార్ అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చిట్యాల మండలం గుండ్రాంపల్లి గ్రామ పంచాయతీ ఆవరణలో ఆదివారం గుండ్రాంపల్లి, సుంకేనపల్లి గ్రామస్తులతో నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఎస్పీ మాట్లాడారు. ఎన్నికల్లో పాల్గొనే నాయకులు కక్షలతో దాడులకు దిగవద్దని సూచించారు. గ్రామాల్లో అసాంఘిక సంఘటనలు చోటు చేసుకుంటే.. వెంటనే వీలేజ్ పోలీస్ ఆఫీసర్లకు సమచారం అందించాలని కోరారు. గుండ్రాంపల్లి గ్రామంలో గతంలో పండగలు, ఎన్నికల సందర్భంలో గొడవలు జరిగిన నేపథ్యంలో గుండ్రాంపల్లి గ్రామాన్ని సమస్యాత్మక ప్రాంతంగా గుర్తించి ముందస్తు చర్యలు తీసుకుంటున్నామన్నారు. గ్రామానికి చెందిన పలువురు హైదరాబాద్‌లో నివాసం ఉంటూ పండగలు, ఎన్నికల సమయంలో ఇక్కడికి వచ్చి ఆనవసర వివాదాలు సృష్టిస్తున్నట్లు పోలీసు శాఖ గుర్తించిందని.. అలాంటి వారిపై నిఘా ఉంచామని తెలిపారు. అనంతరం గుండ్రాంపల్లి శివారులోని 65వ నంబరు జాతీయ రహదారిపై బ్లాక్ స్పాట్‌ను ఆయన పరిశీలించారు. అంతకుముందు వెలిమినేడు గ్రామానికి చెందిన ఎన్‌ఎల్‌ఎన్ ఫౌండేషన్ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. కార్యక్రమాలలో నార్కట్‌పల్లి సీఐ నాగరాజు, చిట్యాల ఎస్‌ఐ మామిడి రవికుమార్ పాల్గొన్నారు.
ఫ ఎస్పీ శరత్‌చంద్ర పవార్


