కొన్ని మిల్లులకే సీఎంఆర్
చేతులెత్తేస్తున్న చిన్న మిల్లులు
జిల్లాలో 163 మిల్లులుంటే.. ధాన్యం ఇచ్చింది 68 మిల్లులకే
ఫ 95 మిల్లులను పక్కన
పెట్టిన పౌరసరఫరాల శాఖ
ఫ రాజకీయ ఒత్తిళ్లు, మామూళ్లతో వారికి సీఎంఆర్ ఇవ్వలేదని ఆరోపణలు
ఫ చిన్న మిల్లులకు సామర్థ్యాన్ని మించి కేటాయించడంపై విమర్శలు
ఫ రైతుల ఇబ్బందులను పట్టించుకోని అధికారులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : సీఎంఆర్ ధాన్యం కేటాయింపులో పౌర సరఫరాల విభాగం పక్షపాత వైఖరి ప్రదర్శిస్తోంది. జిల్లాలో 163 రైస్ మిల్లులు ఉన్నాయి. కానీ.. జిల్లా అధికారులు మాత్రం కేవలం 68 మిల్లులకే 5.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సీఎంఆర్ కోసం అలాట్ చేశారు. మిగిలిన 95 మిల్లులను మాత్రం వదిలేశారు. వారు కేవలం వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. సామర్థ్యం తక్కువగా ఉన్న చిన్న మిల్లులకు అధికంగా ధాన్యం కేటాయించి.. పెద్ద మిల్లులకు మాత్రం ఇవ్వలేదు. మిర్యాలగూడలో 91 మిల్లులు ఉంటే.. ధాన్యం కేటాయించింది 19 మిల్లులకే. తమవల్ల కాదని చిన్న మిల్లుల యాజమాన్యం మొత్తుకుంటున్నా సామర్థ్యానికి మించి ధాన్యం కేటాయించి వాటిపైనే భారం మోపుతున్నారు. దీనివల్ల సకాలంలో కొనుగోళ్లు జరక్కపోవడం, మిలర్లు ధాన్యాన్ని దిగుమతి చేసుకోకపోవడం వంటి సమస్యలతో రైతులకు తంటాలు తప్పడం లేదు. జిల్లాలోని అన్ని మిల్లులకు ధాన్యాన్ని కేటాయిస్తే సమస్యే ఉండదని తెలిసినా అధికారుల వైఖరి మారడం లేదు.
మిల్లింగ్ సామర్థ్యం అధికంగా ఉన్నా..
జిల్లాలోని ఒక్క మిర్యాలగూడ ప్రాంతంలోనే 91 రైస్‌మిల్లులు ఉన్నాయి. అధికారులు కేవలం 19 మిల్లులకే సీఎంఆర్ ధాన్యాన్ని అలాట్ చేశారు. మిగతా మిల్లులపై ఎనలేని ప్రేమ చూపిస్తున్నారు. వాటికి మిల్లింగ్ సామర్థ్యం అత్యధికంగా ఉన్నా.. ధాన్యం ఇవ్వకుండా కేవలం వ్యాపారం చేసుకునేందుకు అనుమతి ఇస్తున్నట్లు విమర్శలు ఉన్నాయి. రాజకీయ ఒతిళ్లు, మామూళ్ల బాగోతం వల్లే వాటికి ధాన్యం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ప్రతి మిల్లు సామర్థ్యంలో 50 శాతం ధాన్యాన్ని సీఎంఆర్ కింద తీసుకొని మరాడించి ఇవ్వాల్సిందే. అలాంటి మిల్లుకే ఎక్స్‌పోర్ట్ చేసేందుకు, ఇతర వ్యాపారం చేసుకునేందుకు అనుమతులు ఇవ్వాలి. కానీ, మిర్యాలగూడలో పెద్ద మిల్లుల యజమానులు సీఎంఆర్ ధాన్యం వైపే చూడడం లేదు. వారికి ఒక క్వింటా ధాన్యం కూడా కేటాయించకుండా నిబంధనలు తుంగలో తొక్కేశారు. ఈ వ్యవహారంలో ఇద్దరు అధికారులే ప్రధాన ప్రాత పోషించినట్లు చర్చ సాగుతోంది.
చిన్న మిల్లులకే 200 శాతం
ధాన్యం కేటాయింపు
జిల్లా పౌర సరపరాల విభాగం అధికారులు ఇటీవల పౌర సరఫరాల కమిషన్‌కు ఒక లేఖ రాశారు. ‘జిల్లాలోని ధాన్యం దిగుబడి బాగా పెరిగింది. మిల్లులకు 200 శాతం ధాన్యం ఇచ్చేలా అనుమతి ఇవ్వాలని’ ఆ లేఖలో పేర్కొన్నారు. కానీ, వచ్చిన ధాన్యం అన్ని మిల్లులకు ఇవ్వకుండా కొన్ని మిల్లులకే అధికంగా ఇవ్వడం, కొన్ని మిల్లులకు అసలు ఇవ్వకపోవడం ఆంతర్యమేంటనేది చర్చనీయాంశమైంది. పోనీ అవన్నీ సీఎంఆర్ బకాయి పడిన మిల్లులా? అంటే కానేకాదు. సీఎంఆర్ బకాయి పడ్డ మిల్లులకు ఇవ్వాలని ఎవరూ చెప్పరు. బకాయి లేకున్నా ఆ మిల్లులకు ఎందుకు కేటాయించడం లేదన్న చర్చ సాగుతోంది.
మిల్లుల సామర్థ్యానికి మించి ధాన్యాన్ని జిల్లా పౌర సరఫరాల విభాగం కొన్ని మిల్లులకు అలాట్ చేసింది. కెపాసిటీకి మించి ధాన్యం ఇస్తే ఎప్పుడు మరాడించి.. బియ్యాన్ని సీఎంఆర్ కింద ఎప్పుడు పెడతారనేది ప్రశ్నార్థకమే. ప్రస్తుతం రెండు సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ ఇంకా కొనసాగుతోంది. సామర్థ్యానికి మించి ధాన్యం ఇవ్వడంతో చిన్న మిల్లులు చేతులు ఎత్తేస్తున్నాయి. పెద్ద మిల్లులు ధాన్యం తీసుకోకుండా హాయిగా తమ బియ్యాన్ని ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తు వ్యాపారం చేసుకుని డబ్బులు గడిస్తున్నా జిల్లా యంత్రాంగం పట్టించుకోవడం లేదు. ఇద్దరు మంత్రులున్న జిల్లాలో కొన్ని మిల్లులు సీఎంఆర్ నుంచి తప్పించుకుని రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.


