సర్పంచ్‌కు 2,641.. వార్డులకు 8,575
11న తొలవిడత పోలింగ్
సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లాలో పంచాయతీ ఎన్నికల మొదటి విడత నామినేషన్ల ప్రక్రియ ఈనెల 27వ తేదీన ప్రారంభమై ఆదివారం తెలవారే వరకు కొనసాగింది. నల్లగొండ, చండూర్ డివిజన్ల పరిధిలోని 14 మండలాల పరిధిలో 318 గ్రామాల్లో సర్పంచ్ పదవుల కోసం 2,641 మంది నామినేషన్లు దాఖలు చేశారు. 2,870 వార్డులకు 8,575 నామినేన్లు దాఖలయ్యాయి. ఆదివారం నామినేషన్ల పరిశీలన చేశారు. 2,641 సర్పంచ్ నామినేషన్లలో నిబంధనల ప్రకారం లేని 692 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 1,949 నామినేషన్లు నిబంధనల ప్రకారం ఉండటంతో వాటిని అధికారులు ఆమోదించారు. అదే విధంగా 8,575 వార్డు సభ్యుల నామినేషన్లలో 682 నామినేషన్లు తిరస్కరణకు గురికాగా 7,893 నామినేషన్లు నిబంధనల ప్రకారం ఉండటంతో వాటిని అధికారులు ఆమోదించారు.
అధికార పార్టీ నుంచి అధికంగా..
జిల్లాలో మొదటి విడత 318 గ్రామాల్లో జరగనున్న ఎన్నికల్లో నామినేషన్ల ప్రక్రియ పూర్తయింది. అయితే అధికార పార్టీ నుంచే అత్యధికంగా పోటీ నెలకొంది. ఆశావహులు తమకు అవకాశాలు కల్పించాలంటూ పెద్ద ఎత్తున ఎమ్మెల్యేల వద్దకు వెళ్తున్నారు. పోటీ ఎక్కువగా ఉండటంతో ఎమ్మెల్యేలు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి నెలకొనడంతో పెద్ద ఎత్తున నామినేషన్లు సమర్పించారు. రెండో స్థాయి నేతలు వారిని బుజ్జగించే పనిలో ఉన్నప్పటికీ ఉపసంహరణకు ససేమిరా అంటున్నారని తెలుస్తోంది. ఒక పక్క కాంగ్రెస్ పార్టీ నూటికి నూరు శాతం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులనే గెలిపించాలంటూ ప్రజలకు పిలుపు ఇస్తున్నా.. ఆశావహులు అధికంగా ఉండటంతో అధికార పార్టీ నేతలకు తలనొప్పిగా మారింది.
ఏకగ్రీవాలకు ప్రయత్నాలు..
జిల్లాలో ఏకగ్రీవాల కోసం ముమ్మరంగా ప్రయత్నాలు సాగుతున్నాయి. ఆయా పంచాయతీల్లో కొంద రు నేతలు ఏకగ్రీవంగా చేస్తే నజరానాలు అందిస్తామని ప్రకటించడంతో చర్చలు మొదలయ్యాయి.
● గుర్రంపోడు మండలం మొల్కలపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎన్నికను ఏకగ్రీవం చేస్తే రూ.19 లక్షలు ఇస్తామని చెప్పడంతో అందుకు ప్రత్యర్థి ఒప్పుకున్నట్లు సమాచారం.
● చండూరు మండలం బంగారిగడ్డ సర్పంచ్‌గా మహ్మద్ సమీనా ఖాసీం ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. అక్కడ ఆమె మినహా మరెవరు నామినేషన్ దాఖలు చేయలేదు. గ్రామభివద్ధికి అక్కడ రూ.73 లక్షలు ఇస్తున్నట్లు సమాచారం.
● మాడ్గులపల్లి మండలం గజలాపురంలో సర్పంచ్ స్థానం ఎస్టీకి రిజర్వు అయింది. అయితే ఒక్కరే నామినేషన్ వేయడంతో ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
● డిండి మండలం కాల్వతండాలో కాంగ్రెస్ అభ్యర్థి ఏకగ్రీవానికి ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు తెలిసింది.
● కొండమల్లేపల్లి మండలం చిన్నఅడిశర్లపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని మాజినానగర్ పంచాయతీలో వేలం ద్వారా ఏకగ్రీవం చేసుకున్నట్లు తెలిసింది.
● చందంపేట మండలంలో నల్లచామలమూల, బుగ్గోనితండా, యాపలపాయ, పొగిల్ల గ్రామాల్లో కూడా గ్రామ పెద్దలు ఏకగ్రీవానికి ప్రయత్నాలు మొదలు పెట్టారు.
● మునుగోడు మండలం జక్కలవారిగూడెంలో సర్పంచ్ ఏకగ్రీవం కోసం ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఫ మొదటి విడత పంచాయతీ
ఎన్నికలకు భారీగా నామినేషన్లు
ఫ ఆదివారం తెలవారే వరకు
కొనసాగిన ప్రక్రియ
ఫ పూర్తయిన నామినేషన్ల పరిశీలన
ఫ ఏకగ్రీవాల కోసం పార్టీల ప్రయత్నాలు
మొదటి నామినేషన్లకు సంబంధించి సోమవారం అప్పీల్‌కు అవకాశం ఉంది. 2వ తేదీన వచ్చిన ఫిర్యాదుల పరిష్కరిస్తారు. 3న మధ్యాహ్నం 3 గంటలకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. ఆ తర్వాత పోటీలో ఉన్న అభ్యర్థులను ప్రకటించి గుర్తులు కేటాయిస్తారు. అప్పటి వరకు మరిన్ని గ్రామాల్లో ఏకగ్రీవమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 9వ తేదీ సాయంత్రం వరకు ప్రచారానికి అవకాశం ఉంది. 11వ తేదీ ఉదయం పోలింగ్ ప్రారంభమై 1 గంటకు ముగియనుంది. అదేరోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ చేపట్టి ఫలితాలు వెల్లడిస్తారు. దాంతో మొదటి విడత ఎన్నికల ప్రక్రియ పూర్తి కానుంది.


