
మునుగోడు నుంచే విద్యుత్ సంస్కరణలు
చౌటుప్పల్ : నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేయడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని, అందుకోసం త్వరలోనే విద్యుత్ శాఖలో సంస్కరణలు తీసుకురానుందని ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. ఆయా సంస్కరణలను మునుగోడు నియోజకవర్గం నుంచే ప్రారంభించాలని కోరారు. నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలు, విద్యుత్ అభివృద్ధి పనులపై మంగళవారం హైదరాబాద్‌లోని టీజీఎస్‌పీడీసీఎల్ కార్యాలయంలో సీఎండీ ముష్రాఫ్‌తో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. మునుగోడు నియోజకవర్గంలో నెలకొన్న విద్యుత్ సమస్యలను పరిష్కరించేందుకు రూ.34 కోట్లు ఖర్చవుతాయని గుర్తించామని, వెంటనే నిధులు మంజూరు చేయాలని కోరారు. విద్యుత్‌శాఖలో పనిచేసే అధికారులు విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాని, ప్రజలను వేధించి డబ్బులు వసూలు చేస్తున్నట్లు తన దృష్టికి వచ్చిందన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాల్సి ఉందన్నారు. రాబోయే మూడు, నాలుగేళ్లలో సమస్యలు పూర్తిగా పరిష్కారమవ్వాలన్నారు. సీఎండీ ముష్రాఫ్ మాట్లాడుతూ.. వ్యవసాయ పొలాల మధ్య ఉన్న ట్రాన్స్‌ఫార్మర్లను మారుస్తామని తెలిపారు. వ్యవసాయ డీపీఆర్‌లకు ఏబీ స్విచ్‌లు పెంచుతామన్నారు. సమావేశంలో యాదాద్రి భువనగిరి, నల్లగొండ జిల్లాల విద్యుత్ శాఖ అధికారులు, ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.
ఫ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి