
తప్పని పాట్లు
ఓపెన్ ప్లాట్లు..
●
దోమలు ఎక్కువయ్యాయి..
వానాకాలం ప్రారంభంలోనే దోమలు విజృంభించి రోగాలకు కారణం అవుతున్నాయి. ఇళ్ల మధ్య ఖాళీ స్థలాల్లో చెత్తాచెదారం, పిచ్చిమొక్కలతో పాటు నీరు నిలిచినా అధికారులు పట్టించుకోవడం లేదు. కనీసం ఫాగింగ్ కూడా చేయడం లేదు. దీంతో ప్రజలు రోగాల బారినపడాల్సి వస్తోంది.
– మైబన్న, శ్రీనగర్‌కాలనీ, నాగర్‌కర్నూల్
సాక్షి, నాగర్‌కర్నూల్: వానాకాలం ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధుల విజృంభించే అవకాశం ఉంది. ముందస్తుగా అప్రమత్తమై, పకడ్బందీగా పారిశుద్ధ్య చర్యలు చేపట్టాల్సిన మున్సిపల్ అధికారుల్లో కదలిక కనిపించడం లేదు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో పారిశుద్ధ్య నిర్వహణ అస్తవ్యస్తంగా కనిపిస్తోంది. పట్టణాల్లోని కాలనీల్లో ఇళ్ల మధ్య ఉన్న ఖాళీ స్థలాలన్నీ మురికి కూపాలను తలపిస్తున్నాయి. శివారు ప్రాంతాలు, నూతనంగా ఏర్పడుతున్న కాలనీల్లో పరిస్థితి అధ్వానంగా కనిపిస్తోంది. ఆయా ప్రాంతాల్లో ఇంకా డ్రైనేజీల నిర్మాణం చేపట్టకపోవడంతో నీరంతా సమీపంలోని ఖాళీ స్థలాల్లోకి చేరుతోంది. వానాకాలం సీజన్‌లో నీటి ఉధృతి పెరిగి ఓపెన్ ప్లాట్లు అన్నీ చెరువులను తలపిస్తున్నాయి. రోజుల తరబడి నిల్వ ఉండే నీటిలో దోమలు గుడ్లు పెడుతూ, తర్వాత సంతతి వేగంగా వృద్ధిచెందుతోంది. దీంతో తరచుగా సీజనల్ వ్యాధుల బారిన పడుతున్నామని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. మురికి నీరు, చెత్తాచెదారం పేరుకుపోయి దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు.
ఖాళీ స్థలాలపై పట్టింపు కరువు..
మున్సిపాలిటీల్లోని ఓపెన్ ప్లాట్లలో నీటి నిల్వ కారణంగా దోమలు వేగంగా వృద్ధి చెందుతున్నాయి. పట్టణాల్లోని ఖాళీ స్థలాలు, లోతట్టు ప్రదేశాల్లో నీరు నిల్వ ఉన్నచోట దోమల లార్వా వృద్ధిచెందకుండా ఆయిల్‌బాల్స్ చల్లడం వంటి చర్యలు తీసుకున్నా ప్రయోజనం ఉంటుంది. వానాకాలం సీజన్‌లో ఎక్కువ కాలం నీరు నిల్వకుండా అధికారులు చర్యలు తీసుకోవాల్సి ఉండగా, ఎక్కడా అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. నిబంధనల ప్రకారం ఓపెన్‌ప్లాట్లలో పిచ్చిమొక్కలు, మురుగు, వర్షపునీరు చేరకుండా జాగ్రత్తపడాల్సిన ఆయా స్థలాల యజమానులకు సూచించాలి. తమ స్థలాన్ని చదును చేసుకునేలా వారికి మున్సిపాలిటీ అధికారులు నోటీసులు జారీ చేయాలి. కానీ సంబంధిత అధికారులు విస్మరిస్తుండటంతో సమస్య పరిష్కారానికి నోచుకోవడం లేదు.
మున్సిపాలిటీల్లోని ఇళ్ల మధ్య ఖాళీ స్థలాలతో ఇబ్బందులు
నీళ్లు నిలిచి మురికికూపాల్లా మారుతున్న వైనం
దోమల ఉధృతికి ఆవాసాలుగా
ఖాళీ ప్రదేశాలు
శివారు ప్రాంతాలు, నూతన కాలనీల్లో మరింత అధ్వాన పరిస్థితి
వాటర్ లాగింగ్ ఏరియాల్లో
కనిపించని పారిశుధ్య చర్యలు
అమలుకాని నిబంధనలు..
ఓపెన్ స్థలాలకు వేకెంట్ ల్యాండ్ టాక్స్ చెల్లించాలని ప్రభుత్వం ఆదేశించింది. కానీ, కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్న సమయంలోనే ఈ టాక్స్ వసూలు చేస్తున్నారు. ఇప్పటికే వందల సంఖ్యలో ఏర్పాటైన ఓపెన్‌ప్లాట్ల యజమానుల వివరాలు సైతం అధికారుల వద్ద లేవు. సీజనల్ వ్యాధుల నిర్మూలన చర్యల్లో భాగంగా ఖాళీ స్థలాలను అధికార యంత్రాంగమే శుభ్రం చేయాల్సి ఉండగా ఈ విషయంలో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఓపెన్ ప్లాట్లను చదును చేసినప్పుడు అయిన ఖర్చును ఆయా యజమానులు ఇంటి నిర్మాణం, ఇతర అనుమతులు కోసం దరఖాస్తు చేసుకున్న సమయంలో వసూలు చేసుకునేందుకు అవకాశం ఉంది. కనీసం ఓపెన్‌ప్లాట్ల యజమానులకు నోటీసులు ఇవ్వడంలోనూ అలసత్వం వీడటం లేదు.

తప్పని పాట్లు

తప్పని పాట్లు