
వెనకబడిన వర్గాల సంక్షేమానికి కృషిచేయాలి
నాగర్‌కర్నూల్: వెనకబడిన వర్గాల శ్రేయస్సుకు బ్యాంకర్లు కృషి చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గురువారం కలెక్టరేట్‌లోని సమావేశ మందిరంలో కలెక్టర్ అధ్యక్షతన డీసీసీ, డీఎల్‌ఆర్‌సీ (బ్యాంకర్ల) సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విజన్‌కు అనుగుణంగా బ్యాంకులు జిల్లా అభివృద్ధికి సహకరించాలన్నారు. జిల్లావ్యాప్తంగా అర్హులైన లబ్ధిదారులకు సకాలంలో రుణాలు అందించి.. వారి ఆర్థికాభ్యున్నతికి తోడ్పాటునందించాలని, ఈ విషయంలో బ్యాంకర్ల పాత్ర ఎంతో కీలకం అన్నారు. అలాగే రైతులకు విరివిగా రుణాలు మంజూరు చేయాలన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలకు, ఇందిరా మహిళ శక్తి రుణాలు, మహిళా స్వయం సహాయక సంఘాల బ్యాంకు లింకేజీ, విద్యార్థులకు సంబంధించి ఉన్నత చదువులకు విద్యా రుణాలను అధిక సంఖ్యలో మంజూరు చేయాలని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంక్షేమ పథకాలకు సంబంధించి బ్యాంకర్లకు కేటాయించిన రుణ మంజూరు లక్ష్యాలను వందశాతం పూర్తిచేయాలన్నారు. బ్యాంకర్లు లబ్ధిదారులకు సంబంధించిన దరఖాస్తులను తప్పనిసరి పరిస్థితుల్లో తిరస్కరించేటప్పుడు అందుకు గల కారణాలు తెలియజేయాలన్నారు. ఈ నెల 15న నిర్వహించే దిశ సమావేశానికి రుణాల వివరాల పూర్తి సమాచారంతో హాజరుకావాలని ఆదేశించారు.
● స్వచ్ఛభారత్ మిషన్ లక్ష్య సాధనకు ఆయా శాఖల అధికారులు కృషి చేయాలని, ప్రతి గ్రామంలో వందశాతం ఓడీఎఫ్ ప్లస్ అమలు చేయాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు స్వచ్ఛమైన తాగునీరు, పరిశుభ్రత అందించడమే ప్రధాన లక్ష్యం అన్నారు. స్వచ్ఛ భారత్ మిషన్‌లో భాగంగా సమీక్ష నిర్వహించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ దేవసహాయం, నాబార్డు డీడీఎం మనోహర్‌రెడ్డి, ఆర్బీఐ ఎల్‌డీఓ రాములు, లీడ్ బ్యాంక్ మేనేజర్ చంద్రశేఖర్, డీఆర్‌డీఓ ఓబులేసు, డీఏఓ చంద్రశేఖర్, డీపీఓ శ్రీరాములు, డీఈఓ రమేష్‌కుమార్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాంలాల్, ఆయా శాఖల జిల్లా అధికారులు రాజేశ్వరి, ఖాజా నాజిమ్ అలీ అప్సర్, రజిని, పీఆర్ ఈఈ విజయ్, మిషన్ భగీరథ ఈఈ సుధాకర్‌సింగ్ తదితరులు పాల్గొన్నారు.
కొండారెడ్డిపల్లిపై ప్రత్యేక దృష్టి
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి గ్రామ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిపెట్టాలని కలెక్టర్ బదావత్ సంతోష్ అన్నారు. ఆయా శాఖల అధికారులు ప్రతి పనిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని, మిగిలిన పనులకు తక్షణమే చర్యలు చేపట్టాలన్నారు. గ్రామంలో వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ గడువులోగా పూర్తిచేయాలని చెప్పారు. అంతకు ముందు గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనుల పురోగతిపై కలెక్టర్ ఆరాతీశారు. ప్రతి పనిపై ప్రగతి వివరాలు, ఎదురయ్యే సవాళ్లు, పూర్తయ్యే గడువు గురించి తెలుసుకున్నారు.