
తుంగభద్రలో ఇసుకతీతకు గ్రీన్‌సిగ్నల్
రాజోళి: తుంగభద్ర నదిలో బోట్ల ద్వారా ఇసుక తీసేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఇసుక కొరత తీరనుంది. ప్రభుత్వ పనులతో పాటు ఇతర నిర్మాణాలకు ఆన్‌లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు సులభతరమైంది. జోగుళాంబ గద్వాల జిల్లాలో రెండు నదులు ఉన్నప్పటికీ.. ఎక్కువగా ఇసుక లభ్యత ఉండేది తుంగభద్ర నదిలోనే. అయితే తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ సరిహద్దులో తుంగభద్ర నది ఉండటంతో ఇసుక తీసుకునే క్రమంలో తరచు వివాదాలు తలెత్తుతున్నాయి. అనుమతులు ఉన్న వాహనాలకు సైతం ఇసుక లభించేది కాదు. దీంతో ఇసుకకు డిమాండ్ పెరిగి.. సామాన్యులకు చాలా ఇబ్బందికరంగా మారింది. ఈ నేపథ్యంలోనే తుంగభద్ర నది నుంచి ఆన్‌లైన్ ద్వారా ఇసుక తీసుకునేందుకు అనుమతులు వచ్చాయి. దీంతో ఉ మ్మడి జిల్లా ప్రజలకు ఇసుక కష్టాలు తీరనున్నాయి.
బోట్ల సహాయంతో..
నదిలో నీటి ప్రవాహం ఉంటే ఇసుక తోడేందుకు గతంలో కుదిరేది కాదు. కానీ ఏపీ ప్రభుత్వం నదిలో నీరున్నా బోట్ల ద్వారా ఇసుకను తోడుతోంది. ఒక్కోసారి తెలంగాణ సరిహద్దులోకి వచ్చి మరీ తోడుకుంటున్నారు. దీంతో జిల్లావాసులకు ఇసుక లభించడం లేదనే వాదనలు ఉన్నాయి. ప్రస్తుతం బోట్ల ద్వారా ఇసుకను తీసుకునేందుకు అనుమతులు ఇవ్వడంతో తెలంగాణ తరఫున కూడా నదిలో బోట్ల ద్వారా ఇసుకను తోడే అవకాశం లభించింది. ఇందుకోసం బోట్లకు ఇసుక తీసే యంత్రాలను అమర్చి నదిలోకి పంపుతారు. వాటి ద్వారా నదిలో నుంచి సామర్థ్యం మేర ఇసుక తోడిన తర్వాత ఒడ్డు మీద డంప్ చేస్తారు. ఆ తర్వాత ఆన్‌లైన్‌లో ఇసుక కోసం దరఖాస్తు చేసుకున్న వారికి టిప్పర్ల ద్వారా సరఫరా చేయనున్నారు.
వచ్చే ఏడాది జూన్ వరకు అనుమతి..
నదిలో ఉన్న ఇసుకను కార్గో సాండ్ బోట్స్ డ్రైజింగ్ మెకానిజం పద్ధతిలో తీసేందుకు పది రోజుల క్రితం టీజీ ఎండీసీ టెండర్లు నిర్వహించింది. ఈ టెండర్ ద్వారా 7.25లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక తీసేందుకు ఓ గుత్తేదారు అనుమతులు పొందారు. నదిలో నుంచి తోడిన ఇసుకను ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకున్న వారికి సరఫరా చేయనున్నారు. వచ్చే ఏడాది జూన్ 21వ తేదీ వరకు ఇసుక అనుమతులు కొనసాగుతాయి. ఈ మేరకు గురువారం తుమ్మిళ్లలో ఇసుక తోడివేత ప్రారంభమైంది.
ఎట్టకేలకు బోట్ల ద్వారా తోడివేత
ఉమ్మడి జిల్లాలో తీరనున్న ఇసుక కొరత
7.25లక్షల మెట్రిక్ టన్నులు తీసేందుకు అనుమతులు