
మెడికల్ కాలేజీ, ఆస్పత్రిపై నజర్
నాగర్‌కర్నూల్ క్రైం: స్థానిక ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 27మెడికల్ కళాశాలల నిర్వహణపై నేష నల్ మానిటరింగ్ కమిటీ ఇటీవల అసంతృప్తి వ్య క్తం చేసిన విషయం తెలిసిందే. ఇందులో నాగర్‌కర్నూల్ ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండటంతో అధి కారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలలో తరగతులు ప్రారంభించి ఇప్పటికే మూడేళ్లు పూర్తి చేసుకుని నాలుగో సంవత్సరంలోకి ప్రవేశించడంతో నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆదేశాల అనుగుణంగా సదుపాయాలు కల్పించడంతో నాలుగో సంవత్సరం విద్యార్థులకు తరగతుల నిర్వహణకు అనుమతులు మంజూరు చేసినట్లు మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ రమాదేవి తెలిపారు.
కలెక్టర్ ఆధ్వర్యంలో నిరంతరం తనిఖీలు
జనరల్ ఆస్పత్రికి వచ్చే రోగులతో పాటు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో విద్యార్థులకు అన్ని సదుపాయాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో కలెక్టర్ బాదావత్ సంతోష్ వాటిలో నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ, సిబ్బందికి తగు సూచనలు చేస్తున్నారు. ఇటీవలే ఆరోగ్యశ్రీ సీఈఓ ఉదయ్‌కుమార్ సైతం జనరల్ ఆస్పత్రిని, ప్రభుత్వ మెడికల్ కళాశాలను సందర్శించి మౌలిక వసతుల కల్పనకు కావాల్సిన వివరాలతో పాటు వైద్య విద్యార్దుల సంఖ్యకు అనుగుణంగా ప్రొఫె సర్లు, అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లు, బోధనేతర సిబ్బంది ఖాళీల వివరాలను, వైద్య పరికరాల గురించి ఆరా తీశారు. మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో ప్రస్తుతం 300 పడకలు ఉండగా మరో 305 పడకలు అదనంగా ఏర్పాటు చేసేందుకు అధికారులు ప్రతిపాదన లు సిద్ధం చేశారు. పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తే వైద్యకళాశాల విద్యార్థులకు మెడికల్ ప్రాక్టీస్ తో పాటు ఆస్పత్రికి వచ్చే రోగులకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందే అవకాశం ఉండనుంది.
తీరు మార్చుకోని వైద్యులు
ఐదు రోజుల క్రితం జనరల్ ఆస్పత్రి, మెడికల్ కళాశాలను ఆరోగ్యశ్రీ సీఈఓ, కలెక్టర్ తనిఖీ చేసేందుకు వచ్చి, వెళ్లిన రోజే ఎమర్జెన్సీ వార్డులో విధులు నిర్వహిస్తున్న ఓ వైద్యురాలు రోగులను పరీక్షించకుండా తన ఫోన్‌లో క్యాండిక్రష్ గేమ్ ఆడుతున్న వీడియో వైరల్‌గా మారడంతో పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మౌలిక సదుపాయాల కల్పనపై ప్రత్యేక దృష్టి
మరో 305 పడకలు ఏర్పాటుకు కసరత్తు
నిర్లక్ష్యం వీడని వైద్యులు