
ఆయిల్‌పాం సాగులో ఆదర్శంగా నిలవాలి
ఊర్కొండ: ఆయిల్‌పాం సాగుపై రైతుల దృష్టి సారించి, రాష్ట్రంలో నాగర్‌కర్నూల్ జిల్లా ఆదర్శంగా నిలవాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ అన్నారు. బుధవారం ఊర్కొండ మండలంలోని మాదారంలో జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతు శ్రీకాంత్‌కు చెందిన 10 ఎకరాల్లో చేస్తున్న ఆయిల్‌పాం ప్లాంటేషన్ కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మాదారం గ్రామం నుంచి శ్రీకాంత్ పొలం వరకు ట్రాక్టర్‌లో ప్రయాణించారు. మాదారంలోనే మరో రైతు కృష్ణారెడ్డి ఆయిల్‌పాం మొదటి క్రాప్ కట్టింగ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో ఆయిల్‌పాం తోటల సాగుకు పొలాలు అనుకూలంగా ఉన్నాయని ఆయిల్‌పాం పరిశోధన కేంద్రం శాస్త్రవేత్తలు గతంలో ధ్రువీకరించారన్నారు.
రైతులకు ప్రోత్సాహకం
ఆయిల్‌పాం సాగు చేసే రైతులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తుందని తెలిపారు. ఒకసారి మొక్క నాటితే నాలుగేళ్లకు దిగుబడి ప్రారంభమై 30 ఏళ్లకు వస్తుందన్నారు. జిల్లాలో ఇప్పటికే 7 వేల ఎకరాల్లో ఆయిల్‌పాం సాగు చేసినట్లు వెల్లడించారు. జిల్లాలో 60 వేల మంది రైతులు 10 ఎకరాల పొలం కలిగిన ఉన్నారని, వారందరూ ఆయిల్‌పాం సాగుపై దృష్టి సారించాలని కోరారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి వెంకటేశం, తహసీల్దార్ యూసఫ్‌అలీ తదితరులు ఉన్నారు.
మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండాలి
తాడూరు: విద్యార్ధులకు ప్రభుత్వం అందించే మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్ బాదావత్ సంతోష్ సిబ్బందికి సూచించారు. బుధవారం మండలంలోని సిర్సవా డ ఉన్నత పాఠశాలలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. మధ్యాహ్న భోజనం తయారీ, పరిసరాల శుభ్రత అంశాలను స్వయంగా పరిశీలించారు. విద్యార్థుల ఆరోగ్యం, పోషణపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుంటుందని, దానికి అందరి సహకారం కావాలని కోరారు. విద్యార్థులకు అందించే నోట్, పాఠ్య పుస్తకాలు, దస్తులు గురించి ఆరా తీశారు. అనంతరం పదో తరగతి విద్యార్థులకు లెక్కలు బోధించడంతో వారితో చేయించారు. సీజనల్ వ్యాధులతో అప్రమత్తంగా ఉండాలని సూచించారు.