
ముగిసిన పాలిసెట్
కందనూలు: జిల్లాలో మంగళవారం నిర్వహించిన పాలిసెట్ ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా పాలిసెట్ కన్వీనర్ మదన్‌మోహన్ తెలిపారు. మొత్తం 9 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని.. 2,805 మంది విద్యార్థులకుగాను 2,629 మంది హాజరుకాగా, 176 మంది గైర్హాజరయ్యారని వివరించారు. 93.7 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారని చెప్పారు. తనతో పాటు స్పెషల్ అబ్జర్వర్ లక్ష్మయ్య, పాలిసెట్ అసిస్టెంట్ కో–ఆర్డినేటర్ అంజయ్య పలు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేసినట్లు తెలిపారు. ప్రవేశ పరీక్ష విజయవంతంగా నిర్వహించేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు.
బోధన నైపుణ్యాలేఅత్యంత కీలకం
తెలకపల్లి: విద్యావ్యవస్థకు ఉపాధ్యాయులే మూల స్తంభాలని.. వారి బోధన నైపుణ్యాలు అత్యంత కీలకమని జిల్లా విద్యాధికారి రమేష్‌కుమార్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని గణిత ఉపాధ్యాయులకు ప్రారంభమైన మొదటి విడత శిక్షణా తరగతులను ఆయన పరిశీలించి మాట్లాడారు. ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థులకు మెళకువలు అందించేందుకు శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. శిక్షణ తరగతులు మంగళవారం నుంచి 31వ తేదీ వరకు కొనసాగుతాయని.. శిక్షణలో నేర్చుకున్న ప్రతి అంశాన్ని తరగతి గతిలో అమలు చేసేందుకు కృషి చేయాలని కోరారు. అదేవిధంగా పాఠశాలలో కొనసాగుతున్న వేసవి శిక్షణ శిబిరాన్ని సందర్శించారు. రోజువారీగా నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. టెస్ట్‌బుక్ మేనేజర్ నర్సింహులు, శ్రీకాంత్, శ్రీనివాసులు, హరికృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు.
వేసవి క్రికెట్ శిక్షణను వినియోగించుకోవాలి
నాగర్‌కర్నూల్: జిల్లాకేంద్రంలోని ఏబీసీ మైదానంలో నెలరోజుల పాటు కొనసాగే ఉచిత క్రికెట్ శిక్షణ శిబిరాన్ని మంగళవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి రాజశేఖర్, ఉపాధ్యక్షుడు సురేష్‌కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్, మహబూబ్‌నగర్ డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ సంయుక్తంగా నిర్వహిస్తున్న శిక్షణ శిబిరాన్ని ఈ ప్రాంత యువకులు సద్వినియోగం చేసుకొని క్రికెట్‌లో రాణించాలని కోరారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో నిర్వహిస్తున్న శిబిరాలకు ఇన్‌చార్జ్‌లుగా మహ్మద్ మోసిన్, సతీష్ ఉంటారని వివరించారు. గ్రామీణ క్రీడాకారుల్లోని నైపుణ్యాలను వెలికితీయాలన్న సంకల్పంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉచిత శిక్షణ శిబిరాలు నిర్వహిస్తోందని.. క్రీడాకారులను నిష్ణాతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా శిక్షణ ఇస్తున్నామన్నారు. నాగర్‌కర్నూల్ యువకులు తమ పేర్లను నమోదు చేసుకొని శిక్షణకు రావడం అభినందనీయమని తెలిపారు.
ఈ నెల 15న జట్ల ఎంపిక..
జిల్లాకేంద్రంలోని నల్లవెల్లి రోడ్‌లో ఉన్న నాగర్‌కర్నూల్ క్రికెట్ అకాడమీ మైదానంలో ఈ నెల 15న అండర్–19 అండర్–23 జిల్లా జట్ల ఎంపిక ఉంటుందని సంఘం ఉపాధ్యక్షుడు సురేష్ తెలిపారు. ఎంపికై న జట్లు ఈ నెల 19 నుంచి ఉమ్మడి జిల్లాకేంద్రంలో జరిగే లీగ్ మ్యాచ్‌లో పాల్గొంటాయన్నారు. ఐదు జిల్లాల్లోని జట్ల నుంచి ఉమ్మడి జిల్లా జట్టు ఎంపిక చేస్తామని చెప్పారు.

ముగిసిన పాలిసెట్