
అన్ని సౌకర్యాలు
సమకూరుస్తున్నాం..
పదో తరగతి పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు ప్రతి ఒక్కరు అంకితభావంతో పనిచేయాలి. సీ–క్యాటగిరీ పరీక్ష కేంద్రాల అధికారులు పోలీస్‌స్టేషన్ నుంచి కేంద్రాలకు ప్రశ్నపత్రాలను తరలింపు సమయంలో అత్యంత జాగ్రత్తగా వ్యవహరించేలా చర్యలు తీసుకున్నాం. జిల్లా వ్యాప్తంగా 61 పరీక్ష కేంద్రాలను గుర్తించాం. వేసవి నేపథ్యంలో ఆయా సెంటర్లలో ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు, మంచినీటి వసతి, ఫ్యాన్లు ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించాం.
– గోవిందరాజులు, డీఈఓ
●
అచ్చంపేట: ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు పదో తరగతి వార్షిక పరీక్షలు కొనసాగనుండగా.. జిల్లా యంత్రాంగం సంబంధిత ఏర్పాట్లలో నిమగ్నమైంది. ప్రతిరోజు ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.30గంటల వరకు పరీక్ష ఉంటుంది. అయితే ఈసారి పరీక్ష కేంద్రం లోపలికి అనుమంతించేందుకు ఐదు నిమిషాల సడలింపు ఇచ్చారు. కానీ గతంలో విద్యార్థులు ప్రశ్నపత్రం చదువుకునేందుకు ఇచ్చే 15 నిమిషాల సమయాన్ని తొలగించారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థుల కోసం ఆయా రూట్లలో ప్రత్యేక బస్సులు నడపాలని అర్టీసీ అధికారులకు సూచించారు.
10,572 మంది హాజరు
జిల్లా వ్యాప్తంగా ఉన్న 295 ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల నుంచి 10,572 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. వీరి కోసం 61 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్షల నిర్వహణపై కలెక్టర్ ఉదయ్‌కుమార్ ఇప్పటికే పలుశాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని శాఖలు సమన్వయంతో వ్యవహరించాలని ఆదేశించారు. ఉత్తమ గ్రేడ్‌లు సాధించడానికి విద్యార్థులకు ప్రత్యేక తరగతులు సైతం నిర్వహిస్తున్నారు. ఇదిలాఉండగా, ప్రతి పరీక్ష కేంద్రంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. ప్రశ్న పత్రాలను నిర్దేశించిన సమయానికి, చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్ట్‌మెంట్ అధికారుల పర్యవేక్షణలో తెరుస్తారు. కేంద్రాల్లో నిర్వహించే ప్రక్రియను వెబ్‌కాస్టింగ్ ద్వారా జిల్లా కలెక్టర్ పరిశీలించే ఏర్పాటు చేశారు.
● ఆన్‌లైన్‌లో హాల్‌టికెట్లు విద్యార్థులంతా www.bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకునేందుకు అవకాశం కల్పించారు. పరీక్ష కేంద్రాలకు వచ్చే ఫ్లైయింగ్, సిట్టింగ్ స్వ్కాడ్‌తో పాటు ఇతర సిబ్బంది ఎవరికీ కూడా సెల్‌ఫోన్ అనుమతి లేదు. ప్రతి ఒక్కరు గు ర్తింపు కార్డును ధరించి కేంద్రాలకు హాజరు కావాలి.
ఏప్రిల్ 3 నుంచి 13వ తేదీ వరకు ఎస్సెస్సీ వార్షిక పరీక్షలు
జిల్లాకు చేరిన ప్రశ్నపత్రాలు..
పకడ్బందీగా మండలాలకు తరలింపు
సిబ్బందికి ఇప్పటికే శిక్షణ పూర్తి
స్ట్రాంగ్ రూంలలో ప్రశ్నపత్రాలు
పదో తరగతి పరీక్షలకు సంబంధించిన ప్రశ్నపత్రాలు జిల్లాకు చేరుకున్నాయి. మొదట ఎస్పీ కార్యాలయానికి చేరుకోగా అక్కడి నుంచి డీఈఓ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య జిల్లాలోని 18 పోలీస్‌స్టేషన్లకు తరలించారు. అక్కడి స్ట్రాంగ్ రూంలలో వాటిని భద్రపరిచారు. పరీక్షకు గంట ముందుగానే కస్టోడియన్లు పోలీస్ సిబ్బందితో కలిసి ప్రశ్న పత్రాలను పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లడం, అనంతరం పోస్టల్‌శాఖ ద్వారా పకడ్బందీగా పంపేలా చర్యలు తీసుకున్నారు. పోలీసు బందోబస్తు, ఫ్లైయింగ్ స్క్వాడ్ కోసం ఎస్కార్ట్ వాహనాలు ఏర్పాటు చేశారు. ఇదిలాఉండా, పదో తరగతి పరీక్షలకు ఎండలే అసలు సమస్యగా మారనున్నాయి. వచ్చే నెల మరింత తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈక్రమంలో విద్యార్థులకు వార్షిక పరీక్షల కంటే ముందు ఎండలను ఎదుర్కోవడమే అసలు పరీక్షగా మారనుంది. దీంతో పరీక్ష కేంద్రాల వద్ద ఒక ఏఎన్‌ఎం ఉంచి ప్రాథమిక వైద్య కిట్లు, ఓఆర్‌ఎస్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచేలా సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, మంచినీటి వసతి, శానిటేషన్ ఏర్పాట్లు చేయాల్సి ఉంది. విద్యార్థులు సకాలంలో పరీక్ష కేంద్రాలకు చేరేందుకు ప్రత్యేక ఆర్టీసీ బస్సులను నడపాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల వద్ద జిరాక్స్ సెంటర్లు మూసివేయాలని,144 సెక్షన్ విధించాలని సూచించారు.
