ఎయిడ్స్‌వ్యాధి నిర్మూలనకు పాటుపడాలి
● డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు
ములుగు రూరల్: ఎయిడ్స్ వ్యాధి నిర్మూలనకు ప్రతిఒక్కరూ పాటుపడాలని డీఎంహెచ్‌ఓ గోపాల్‌రావు అన్నారు. జిల్లా వైద్యశాఖ కార్యాలయంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవంపై అవగాహన కార్యక్రమం సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అడ్డంకులను అధిగమిద్దాం, ఎయిడ్స్ ప్రతిస్పందనను మారుద్దాం అనే నినాదంతో ఈ సంవత్సరమంతా ప్రతిఒక్కరూ పనిచేయాలన్నారు. ఎయిడ్స్ వ్యాధి వ్యాప్తి చెందే విధానం, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించి వ్యాధిని అరికట్టవచ్చని వివరించారు. కళాశాల, ఉన్నత పాఠశాల విద్యార్థులకు వ్యాధి పట్ల అవగాహన కల్పించాలన్నారు. ఈ అవగాహన కార్యక్రమాల్లో స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, ఆరోగ్య కార్యకర్తలు, స్వయం సహాయక సంఘాల సభ్యులు పాల్గొన్నాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎయిడ్స్ నియంత్రణ అధికారి చంద్రకాంత్, జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్లు శ్రీకాంత్, రణధీర్, డీపీఎంవో సంజీవరావు, డెమో సంపత్, ఏఎంఓ దుర్గారావు, ఎయిడ్స్ జిల్లా నియంత్రణ ప్రోగ్రాం మేనేజర్ నీలిమా తదితరులు పాల్గొన్నారు.


